కలం, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. 9 రోజుల కార్యక్రమాల్లో భాగంగా వార్డు సభ్యులు, సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, ఛైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లను భాగస్వాములను చేయాలని కోరారు. వార్డు సభ్యులు, సర్పంచులు, ఛైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లు అందరికీ జిల్లా కేంద్రాల్లో ఒక రోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని సూచించారు. వారి విధులు, బాధ్యతలకు సంబంధించి అవగాహన కల్పించడంతో పాటు ప్రింటెడ్ మెటీరియల్ వారికి అందించాలన్నారు. సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో (Collectors Conference) సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అధికారులకు కీలక సూచనలు చేశారు. ‘సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలి. వ్యవసాయ పంప్ సెట్లకు బదులు సోలార్ పంప్ సెట్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలి. సోలార్ మోటార్లతో కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించాలి. ఇళ్లపైన సోలార్ ప్లాంట్లు అమర్చుకోవడం.. సోలార్ విద్యుత్ వాడుకోవటం తో పాటు గ్రిడ్ కు కనెక్ట్ చేయడం ద్వారా వచ్చే ఆదాయంపై అన్ని గ్రామాల్లో విద్యుత్ శాఖ అవగాహన కల్పించాలి.’ అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రభుత్వ పథకాలు వివరించండి
గ్రామ, వార్డు సభల్లో నూతనంగా ఇచ్చిన రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Indlu), 200లోపు యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ లబ్ధిదారుల వివరాలు తెలియజేయాలని సీఎం సూచించారు. 35 ప్రభుత్వ మెడికల్ కళాశాలల సేవలు ప్రజలకు అందేలా చూడాలని కోరారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఇతర స్థానిక వైద్య సంస్థలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలకే రిఫర్ చేయాలని పేర్కొన్నారు. మెడికల్ కళాశాలల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలు, వైద్య విద్యార్థులు, వైద్యులు, ప్రొఫెసర్లు ఉన్నారు. వారి సేవలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఫేషియల్ రికగ్నైజేషన్ మస్ట్
ప్రతి ప్రభుత్వ పథకం లబ్ధిదారుల ముఖ గుర్తింపు (ఫేషియల్ రికగ్నైజేషన్) చేపట్టాలని కోరారు. అర్హులకు కచ్చితంగా లబ్ధి జరగాలని సూచించారు. అదే సమయంలో అనర్హులు లబ్ధిపొందకూడదన్నారు. ఆసరా పింఛన్లలో ముఖ గుర్తింపు చేపట్టడంతో 3 లక్షల మంది అనర్హుల పేర్లు తొలగించగలిగామన్నారు. సాంకేతికతను సరిగా వినియోగించుకోకపోవడంతోనే ఇంత పెద్ద సంఖ్యలో అనుచిత లబ్ధి పొందారని పేర్కొన్నారు. రవాణా శాఖ డాటా ఆన్‌లైన్ పూర్తి చేయాలన్నారు.
‘పాఠశాలలు బస్సులు, ఇతర వాహనాలకు ఫిట్‌నెస్ పరీక్షలు సక్రమంగా నిర్వహించాలి. ఆర్టీసీ బస్సు డ్రైవర్లతో పాటు లారీలు, ఇతర సరకు రవాణా వాహనాల డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించాలి. ఎక్కువ సంఖ్యలో డ్రైవర్లు కలుసుకునే చోట్లనే ఈ శిబిరాలు ఏర్పాటు చేసి వారికి పరీక్షలు నిర్వహించాలి. రహదారులపై భారీ స్థాయిలో గుంతలు, ప్రమాదం జరిగే స్థలాల వివరాలు తెలుసుకునేందుకు వాట్సాప్ నెంబర్ ను రవాణా శాఖ ఇవ్వాలి. ఆ నంబర్‌కు వచ్చే సమాచారం ఆధారంగా అక్కడ మరమ్మతులు చేపట్టడం, ఇతర జాగ్రత్తలు తీసుకోవడం చేయాలి. ఓఆర్ఆర్, ఓఆర్ఆర్ సర్వీసు రోడ్ల వెంట భారీగా చెత్త, ఇతర నిర్మాణ వ్యర్ధాలు డంప్ చేస్తున్నారు.‘ అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
అటువంటి వాహనాలను ఉపేక్షించొద్దు
వ్యర్ధాలను తీసుకువచ్చే వాహనాలను పట్టుకొని జరిమానాలు విధించాలి. కేసులు పెట్టాలి. ఓ ఆర్ ఆర్ ఏజెన్సీని బాధ్యులను చేయాలి. మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ప్రతి నెలా బిల్లులు ఎలాంటి ఇబ్బంది లేకుండా చెల్లించాలి. పిల్లలకు పోషకాహారం అందాలి. అందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలి. మూడు కార్పొరేషన్లతో పాటు నగరాలు, పట్టణాల్లోని వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు, బాయ్స్, గరల్స్ హాస్టళ్ల వివరాలు నమోదు చేసుకోవాలి. ఆయా హాస్టళ్ల ఏర్పాటుకు అనుమతులు, వాటిపై పర్యవేక్షణ ఉండాలి. వాటి యాజమాన్యాలకు జవాబుదారీతనం ఉండాలి. పాఠశాలలు, కళాశాలల్లో గంజాయి, డ్రగ్స్, ఈ-సిగరెట్ల వినియోగం జరిగితే అందుకు ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు బాధ్యత వహించాలి.. ప్రతి ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాల, కళాశాలల్లో సబ్జెక్ట్ టీచర్స్, పీఈటీ ఎలా ఉంటారో అలానే సైకాలజిస్ట్ ఉండేలా చూడాలి.’ అంటూ రేవంత్ పేర్కొన్నారు.
భూసార పరీక్షలు చేపట్టండి
‘వ్యవసాయశాఖ భూసార పరీక్షలు చేపట్టి సకాలంలో రైతులకు వాటి సమాచారం అందజేయాలి.. ఏ భూమిలో ఏ పంట బాగా పండుతుంది అనే విషయం రైతులకు తెలియజేయాలి.. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలు సాగు చేసేలా అన్నదాతలను ప్రోత్సహించాలి…పంట మార్పిడి, పంటల వైవిధ్యత ప్రయోజనాలను వివరించాలి. యూరియా యాప్‌లో కొంత గందరగోళం ఉన్నట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు. దానిని సులువుగా వినియోగించేలా మార్పులు చేయాలి.. నానో యూరియా ఉపయోగాలను క్షేత్రస్థాయిలో ప్రదర్శన ద్వారా రైతులకు చూపించాలి. వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ పరస్పరం సమన్వయంతో ముందుకు సాగాలి. పంటలు వేసే మొదలు పంట ఉత్పత్తుల అమ్మకం వరకు సరైన కార్యాచరణ ప్రణాళిక ఉంటేనే ఇబ్బందులు ఎదురుకావు. ఈ విషయంలో ఈ రెండు శాఖలు పరస్పర సహకారంతో ముందుకుసాగాలి. కలెక్టర్లు తమ తమ జిల్లాల్లో పంటల వైవిధ్యతకు ఉన్న అవకాశాలపై నివేదిక సమర్పించాలి.’ అంటూ రేవంత్ రెడ్డి కలెక్టర్లకు (Collectors Conference) సూచించారు.
Read Also: దేవనపల్లి కవిత అరెస్ట్
Follow Us On : WhatsApp

