కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా చర్ల మండలం పరిధిలోని ఎదిరా గుట్ట (Edira Hills) ల సమీపంలో రాత్రి వేళల్లో చిరుత పులి (Leopard) సంచరిస్తుండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ప్రధాన రహదారిపై చిరుత దర్జాగా నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం వైరల్‌గా మారాయి. ఎదిరా గుట్టల పరిసర ప్రాంతాల్లోని సుమారు ఐదు గ్రామాల ప్రజలు ప్రస్తుతం రాత్రి వేళల్లో బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లిన వారు రాత్రి వేళల్లో ఇళ్లకు చేరుకోవడానికి జంకుతున్నారు. రహదారిపై చిరుత కనిపించడంతో ఒంటరి ప్రయాణాలు, ముఖ్యంగా బైకులపై వెళ్లే వారు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు.
ఈ ప్రాంతంలో చిరుత పులి ఇలా నేరుగా రోడ్డు మీదికి రావడం, ప్రజల కంటపడటం ఇదే మొదటిసారని స్థానికులు చెబుతున్నారు. సాధారణంగా అడవి లోపల ఉండే క్రూర జంతువులు ఇలా జనావాసాలకు దగ్గరగా ఉన్న రోడ్డుపైకి రావడం అరుదు. అయితే చిరుత సంచారం భయాన్ని కలిగిస్తున్నప్పటికీ, అంతరించిపోతున్న ఇటువంటి వన్యప్రాణిని తమ కళ్లతో నేరుగా చూడటం ఒక అద్భుతమైన అనుభూతిని, ఆనందాన్ని ఇచ్చిందని కొందరు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చిరుత పులి రోడ్డుపైకి రావడాన్ని వన్యప్రాణి విశ్లేషకులు రెండు కోణాల్లో చూస్తున్నారు. చర్ల పరిసర అడవుల్లో వన్యప్రాణులకు అనుకూలమైన వాతావరణం ఉందనడానికి, జీవవైవిధ్యం మెరుగవుతుండటానికి చిరుత ఉనికి ఒక శుభపరిణామమని కొందరు భావిస్తున్నారు. అదే సమయంలో, గుట్టల్లో నీరు లేదా ఆహార కొరత కారణంగానే చిరుత జనావాసాల వైపు లేదా రహదారుల వైపు వచ్చి ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అటవీ శాఖ అధికారులు తక్షణమే రంగంలోకి దిగి చిరుత సంచరిస్తున్న ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి దాని కదలికలను గమనించాలని ప్రయాణికులు కోరుతున్నారు. రాత్రి వేళల్లో ప్రయాణించే వారి కోసం ఎదిరా గుట్టల మార్గంలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

