కలం, తెలంగాణ బ్యూరో : తెలంగాణ (Telangana) రాజకీయాలలో ఇప్పుడు కొత్త హీట్ మొదలైంది. ఒకప్పుడు ఒకే పార్టీ, ఒకే జెండా కింద పనిచేసిన అన్నాచెల్లెళ్లు కేటీఆర్, కవిత (KTR vs Kavitha) ఇప్పుడు వేర్వేరు రాజకీయ వేదికలపై ఒకరికి ఒకరు పోటీగా నిలుస్తున్నారు. వడ్ల కొనుగోలు అంశాన్ని కేంద్రంగా చేసుకుని ఇద్దరూ రాజకీయంగా తమ బలం చాటుకునే ప్రయత్నం చేయడం రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశమైంది.
వడ్ల ఇష్యూతో పోటీ పబ్లిసిటీ
రాష్ట్రంలో వరి కొనుగోళ్లు సరిగా జరగడం లేదని విమర్శిస్తూ కేటీఆర్ తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. అదే సమయంలో కవిత కూడా టీఆర్ఎస్ బ్యానర్‌తో సెక్రటేరియట్ ఎదుట వడ్ల కుప్పలతో నిరసన చేపట్టడం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరి కార్యక్రమాలు ఒకే అంశంపై, దాదాపు ఒకే సమయంలో జరగడం వెనుక మీడియా ఫోకస్ సంపాదించాలనే రాజకీయ వ్యూహం కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. “నువ్వా నేనా” అన్నట్టుగా ఇద్దరూ ప్రజా సమస్య కంటే రాజకీయ ఇమేజ్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టారని విమర్శలు వినిపిస్తున్నాయి.
‘తగ్గేదే లే’ అన్నట్టు రాజకీయ పోటీ
పార్టీలు వేరైనా పోటీ ధోరణి మాత్రం ఒకటే అన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో ఉంది. ప్రెస్‌మీట్‌లు, ధర్నాలు, ర్యాలీలు మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఇద్దరి శైలి పోటాపోటీగా మారింది. కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహిస్తే, వెంటనే కౌంటర్‌గా కవిత రోడ్డెక్కడం ఇప్పుడు తరచుగా కనిపిస్తున్న ట్రెండ్‌గా మారింది. అన్న మీడియా ముందు విమర్శలు చేస్తే, చెల్లెలు ప్రత్యక్ష ఆందోళనలతో స్పందిస్తున్నారు. దీంతో ఈ పోటీ రాజకీయ అవసరమా? లేక వ్యక్తిగత ప్రతిష్ట పోరా? అన్న చర్చ సాగుతోంది.
రైతుల సమస్యలకా? లేక మీడియా స్పేస్‌కా?
రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కారాల కోసం కృషి చేయాల్సిన సమయంలో, మీడియా హైలైట్ కోసం మాత్రమే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రజా సమస్యల కంటే “ఎవరు ఎక్కువగా కనిపిస్తున్నారు?” అన్నదానిపైనే ఫోకస్ పెట్టినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
బీఆర్ఎస్‌లోనే మొదలైన కోల్డ్ వార్
అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాలు కొత్తవి కావని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇద్దరూ బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడే అంతర్గత పోటీ మొదలైందని, ఢిల్లీ లిక్కర్ కేసు తర్వాత అది మరింత పెరిగిందని చర్చ ఉంది. పార్టీ కార్యాలయంలో కూడా తనకు పరిమితులు విధించారంటూ కవిత పలు సందర్భాల్లో వ్యాఖ్యానించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం వేర్వేరు రాజకీయ వేదికలపై ఉన్న కేటీఆర్, కవిత మధ్య పోటీ భవిష్యత్తులో మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి ‘బీఆర్ఎస్ vs టీఆర్ఎస్’ మాత్రమే కాకుండా ‘కవిత vs కేటీఆర్’ అనే రాజకీయ సమీకరణ మరింత స్పష్టంగా మారొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

