కలం, తెలంగాణ బ్యూరో : వివిధ విభాగాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి క్యాబినెట్ (Telangana Cabinet) భేటీ ఆమోదం తెలపనున్నది. మొత్తం 50 వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆయా విభాగాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్గ సమావేశానికి నోట్ తయారుచేసింది. ఇందులో ఏయే విభాగంలో ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలనేది ఈ మీటింగ్ చర్చించి స్పష్టమై నిర్ణయాన్ని తీసుకోనున్నది. గత క్యాబినెట్ సమావేశాలకు కొన్ని ప్రతిపాదనలు రాగా తాజాగా మరికొన్ని పోస్టుల భర్తీపైన వివరాలు అందినట్లు సచివాలయ వర్గాల సమాచారం. పోలీసు శాఖలో సాధారణ కానిస్టేబుల్ మొదలు ఎస్ఐ ర్యాంక్ వరకు దాదాపు 19 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు డీజీపీ గుర్తించారు.
రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రాధాన్యతలకు అనుగుణంగా భర్తీ కావాల్సి ఉన్నది. ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు జరిగే క్యాబినెట్ భేటీలో పోలీస్ శాఖలో 13 వేల పోస్టుల భర్తీ, ఇతర శాఖల్లోని 12 వేల పెండింగ్ పోస్టులు, ఆర్టీసీలో మూడు వేల పోస్టులు, అగ్నిమాపక శాఖలో 700 పోస్టులు, అటవీశాఖలో బీట్ కానిస్టేబుళ్లుగా 1100 పోస్టుల చొప్పున ఉన్నట్లు సచివాలయ వర్గాల ద్వారా తెలిసింది. దీనికి తోడు వివిధ విశ్వవిద్యాలయాల్లో దాదాపు 20 వేల అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులతో పాటు కొన్ని మినిస్టీరియల్ పోస్టులు కూడా ఉన్నాయి. గత క్యాబినెట్ సమావేశంలో చర్చకు వచ్చిన ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో ఉన్న కొన్నింటికి ఈ మీటింగులో ఆమోదం లభించనున్నట్లు తెలిసింది.
వరంగల్ జిల్లా కేసముద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు, అసెంబ్లీ కార్యదర్శి నియామకం ర్యాటిఫికేషన్, నిజామాబాద్ తెలంగాణా యూనివర్సిటీలో 27 పోస్టులకు ర్యాటిఫికేషన్, చొప్పదండిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 59 పోస్టుల భర్తీకి ఈ సమావేశంలో ఆమోదం లభించే అవకాశమున్నది. ఈ అంశాలకు తోడు తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణం, హైదరాబాద్ ఐఐటీ నిపుణులు సూచించిన డిజైన్లు, ఇందిరమ్మ ఇండ్ల సెకండ్ ఫేజ్ లాంఛన ప్రారంభోత్సవం, ఇందిరమ్మ జీవిత బీమా పథకం లాంఛింగ్, రెండు లక్షల మందికి కొత్తగా ఆసరా పింఛన్ల మంజూరు తదితర అంశాలపైన కూడా ఈ క్యాబినెట్ భేటీలో చర్చ జరగనున్నది.

