Mobile Popup Ad
Mobile Popup Ad

మెడికల్, ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్.. ప్రాథమిక చర్చలు

కలం, తెలంగాణ బ్యూరో : దేశవ్యాప్తంగా మెడికల్, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రన్స్ టెస్టును వేర్వేరుగా కాకుండా కామన్‌గానే నిర్వహించడంపై కసరత్తు మొదలైంది. ఉమ్మడి ప్రవేశ పరీక్షా విధానంలోని అనుకూల, ప్రతికూల అంశాలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ త్వరలో లోతుగా చర్చించి స్పష్టతకు రావాల్సి ఉన్నది. ప్రస్తుతం ఇంజినీరింగ్ కోర్సుల కోసం జేఈఈ (JEE), మెడికల్ కోర్సుల కోసం నీట్ (NEET) రాయాల్సి వస్తున్నది. భవిష్యత్తులో ఈ రెండింటికీ ఒకే ప్రవేశ పరీక్ష పెట్టడంపై ప్రాథమిక స్థాయిలో ఆలోచన, కార్యాచరణ మొదలైంది.

కేంద్ర ప్రభుత్వం కూడా దీనిని పరిశీలిస్తున్నది. ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించే ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ఉన్నత విద్యా శాఖ అధికారులు సూత్రప్రాయంగా సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్నదని, ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ఇకపైన జేఈఈ, నీట్ లాంటి విడివిడిగా ప్రవేశ పరీక్షలు ఉండకపోవచ్చని తెలిపారు.

పరీక్ష ఒకటే.. ప్రశ్నాపత్రాలు వేర్వేరు :

కామన్ టెస్ట్ విధానంలో మెడికల్ అభ్యర్థులకు బయాలజీ, ఇంజినీరింగ్ అభ్యర్థులకు మ్యాథమెటిక్స్.. ఇలా వేర్వేరు సెక్షన్లు ఉంటాయి. దీనికి తగినట్లుగానే పరీక్షల నమూనా రూపొందుతున్నది. ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్ష విధానం గురించి పార్లమెంటరీ కమిటీకి అధికారులు సమాచారం ఇచ్చిన తర్వాత కమిటీ సభ్యుల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించినట్లు సమాచారం. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఉన్నతాధికారులు ఈ కీలక ప్రతిపాదనలను నివేదించారు. ఈ సమావేశానికి ఎన్‌టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషి హాజరయ్యారు.

డాక్టర్ కె. రాధాకృష్ణన్ కమిటీ నివేదిక ఆధారంగా చేపట్టబోయే సంస్కరణలను కమిటీకి వివరించారు. ప్రస్తుతం నీట్ పెన్ను, పేపర్‌తో ఓఎంఆర్ పద్ధతిలో జరుగుతున్నది. ఓఎంఆర్ విధానం వల్లనే అక్రమాలకు ఆస్కారం ఏర్పడుతోందని, వచ్చే ఏడాది నుంచి సీబీటీ మోడ్‌లోనే నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. కమిటీ సమావేశంలో ఈ అంశం కూడా ప్రస్తావనకు వచ్చిన్పపుడు దీనికి అవసరమైన మౌలిక సదుపాయాలు, ఎగ్జామ్ టైమ్, టెక్నికల్ సెక్యూరిటీ తదితరాల గురించి అధికారులను ఎంపీలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>