కలం, భూపాలపల్లి: తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్ట్ శ్రీరామరక్ష అని, కరువులో ఆదుకుంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ప్రస్తుతం ఎల్ నినో పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో వర్షాలు పడటం లేవని.. కానీ, గోదావరిలో మాత్రం మేడిగడ్డ మీదుగా లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా పోతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మేడిగడ్డ కుంగిపోయిందని బదనాం చేస్తూ.. ఎత్తిపోతలను బంద్ పెట్టిందని మండిపడ్డారు.
కన్నేపల్లి పంప్ హౌస్ సందర్శించిన కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించారు. పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి పలు విభాగాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ఎర్రటి ఎండల్లో కూడా తెలంగాణలో నీళ్లు దొరికే ఏకైక ప్రాంతం కన్నేపల్లి అన్నారు.
రూ.400 కోట్లతో రిపేర్లు చేయొచ్చు..
కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. 27 రిజర్వాయర్ల సమహారమని, అందులో మేడిగడ్డ వద్ద రెండు పిల్లర్లకు పగుళ్లు వస్తే.. రిపేర్లు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. రూ.400 కోట్లు వెచ్చిస్తే.. ప్రాజెక్ట్ మరమ్మతులు చేయవచ్చని ఇరిగేషన్ నిపుణులు చెబుతున్నారని వివరించారు. అసలు ప్రాజెక్ట్ పిల్లర్లు కుంగిపోవడం వెనుక కాంగ్రెస్ వాళ్ల కుట్ర ఉండొచ్చని అనుమానించారు. తాము రిపేర్ చేస్తామని నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ సంస్థ చెబుతున్నా.. 31 నెలలవుతున్నా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం పస లేని విమర్శలు చేస్తూ కాలం గడుపుతున్నారని మండిపడ్డారు.
ప్రాజెక్ట్ ఖర్చు రూ.94 వేల కోట్లు..
కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతి పెద్ది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని కేటీఆర్ అన్నారు. నిపుణుల సలహాలు, సూచనలతోనే ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందన్నారు. కరవులో కూడా నీళ్లు దొరికే ప్రాంతం ఎక్కడుందని కేసీఆర్ నిపుణులతో నెలల పాటు చర్చించిన తరువాత.. మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించారని వివరించారు. తాను పుట్టినప్పటి నుంచి పోలవరం ప్రాజెక్ట్ గురించి వింటూనే ఉన్నానని.. ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు. కానీ, కాలంతో పోటీ పడుతూ కాళేశ్వరాన్ని నాలుగేళ్ల సమయంలోనే కేసీఆర్ నిర్మించారని వివరించారు.
60 వేల మందితో ముట్టడిస్తాం..
కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎత్తిపోతల బంద్ చేయించడం వలన కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ జిల్లాల రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరానికి కూడా తాగునీటికి కటకట ఏర్పడే పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని, కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే, త్వరలోనే 60 వేల మంది రైతులతో పంప్ హౌస్ ముట్టడిస్తామని హెచ్చరించారు.

