కలం, ఖమ్మం బ్యూరో: ఎస్సీ వర్గీకరణ (SC Classification) పేరుతో కేంద్రంలో మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ కుట్రలకు పాల్పడుతోందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ఆరోపించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవనంలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
బీజేపీ ప్రభుత్వం దళితుల మధ్య చిచ్చు రేపుతూ, మాల సామాజిక వర్గం పట్ల చిన్నచూపు చూస్తూ వారిని అణచివేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటులో చట్టం చేసే వరకు పోరాటం కొనసాగుతుందని, ప్రజాస్వామ్యంలో ప్రజలు తలుచుకుంటే ఎలాంటి చట్టాలైనా వెనక్కి తీసుకోక తప్పదని హెచ్చరించారు.
రిజర్వేషన్లు ఎలా పంచుతారో..
ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాల తీరును ఆర్ఎస్ రత్నాకర్ తప్పుబట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి 59 ఎస్సీ కులాలకు రిజర్వేషన్లను ఏ విధంగా పంచుతారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాలలను తడి గుడ్డతో గొంతు కోస్తోందని విమర్శించారు. సామాజిక న్యాయం పేరుతో దేశవ్యాప్తంగా ఎస్సీ జాబితాలో ఉన్న 1,108 కులాలకు రిజర్వేషన్లను మోదీ ప్రభుత్వం ఎలా పంచుతుందని నిలదీశారు.
పోరాటానికి సిద్ధం కావాాలి..
తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తుంటే, మాల ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడం దారుణమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ జాతి పట్ల విశ్వాసంగా లేరనే విషయాన్ని గమనించి, మాలలంతా తమ ఉనికిని కాపాడుకోవడం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం కావాలని రత్నాకర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు బొజ్జా శరత్ మోహన్, దాసరి రమేష్, బీరం సతీష్ కుమార్, పలిగిరి కనకరాజు తదితరులు పాల్గొన్నారు.

