Mobile Popup Ad
Mobile Popup Ad

కేసీఆర్ ద‌త్త‌త గ్రామ ప్రజల కన్నీళ్లకు రేవంత్‌ సర్కార్ ఓదార్పు..!

కలం, నల్లగొండ బ్యూరో: ముఖ్యమంత్రి వచ్చిండు.. ముద్ద పెట్టిండు.. మురిసిపోయాం. కొత్త ఇళ్లు ఇస్తాడనుకుంటే.. ఉన్న గూడును కూడా గుంజేసుకుని నట్టేట ముంచాడు.. ఇదీ నాలుగేళ్లుగా యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి (Vasalamarri) నిరుపేదల గుండెల్లో రగిలిన ఆవేదన. నాడు తమ గ్రామాన్ని దత్తత తీసుకుంటానన్న కేసీఆర్ (KCR) నమ్మకద్రోహం చేశాడని, సొంత పక్కా ఇళ్లను సైతం చేతులారా కూల్చుకుని, కట్టుబట్టలతో రేకుల షెడ్లలో, ప్లాస్టిక్ కవర్ల కింద నరకం చూశామని వాసాలమర్రి గ్రామస్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ కన్నీళ్లకు ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కార్ (Congress Govt) ఓదార్పునిచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 143 ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses)ను కట్టించి ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సర్కార్ ఆ ఊరి గుండెల్లో వెలుగులు నింపింది. ఈ జూలై రెండో వారంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సామూహిక గృహప్రవేశాలకు ఊరంతా పండగలా సిద్ధమవుతున్న వేళ.. నాడు కేసీఆర్ ఇచ్చిన హామీలపై, నేడు కాంగ్రెస్ నెరవేర్చిన కలలపై, వాసాలమర్రి ప్రజల మనోగతంపై ‘కలం’ ప్రత్యేక విశ్లేషణ.

కేసీఆర్ దత్తత హంగామా.. ఊరు నమ్మిన పాపం..

2020 నవంబర్‌లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించి రాష్ట్రవ్యాప్తంగా నానా హంగామా చేశారు. గ్రామానికి వచ్చి, ప్రజలతో కలిసి సహపంక్తి విందు భోజనాలు చేసి, “ఈ ఊరిని బంగారు వాసాలమర్రి చేస్తా.. అందరికీ ఇంటిగ్రేటెడ్ మోడల్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టిస్తా” అంటూ హామీల వర్షం కురిపించారు. అధికారులు సైతం రంగంలోకి దిగి సర్వేలు చేయడంతో గ్రామస్థులు కేసీఆర్ మాటలను నమ్మారు. కొత్త ఇళ్లు వస్తాయనే ఆశతో, ఉన్న పక్కా ఇళ్లను, గుడిసెలను తమ చేతులతో తామే కూల్చేసుకున్నారు. కానీ, ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. హంగామా ముగిసింది, కేసీఆర్ ఫాంహౌస్‌కు పరిమితమయ్యారు. వాసాలమర్రి వైపు కన్నెత్తి చూసింది లేదు. నిధులు విదిల్చింది లేదు. ఫలితంగా సొంత ఇళ్లు కూల్చుకున్న వందలాది కుటుంబాలు కట్టుబట్టలతో కిరాయి ఇళ్లలో, ప్లాస్టిక్ కవర్ల కింద తాత్కాలిక నివాసాల్లో ఇన్నేళ్లు నరకయాతన అనుభవించాయి.

ఆదుకున్న రేవంత్ స‌ర్కార్‌

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాసాలమర్రి బాధితుల ఆర్తనాదాలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లాయి. కేసీఆర్ హామీలు నమ్మి నిరుపేదలు రోడ్డున పడటాన్ని గమనించిన రేవంత్ సర్కార్.. ఈ గ్రామంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. గ్రామం నుంచి దాదాపు 240 మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా, అత్యంత పారదర్శకంగా అర్హులైన 143 మంది లబ్ధిదారులకు ఒకేసారి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. కేవలం కాగితాలకే పరిమితం కాకుండా స్పెషల్ ఆఫీసర్లను నియమించి యుద్ధప్రాతిపదికన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయించింది. ప్రస్తుతం ఈ ఇళ్ల పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి.

జూలై రెండో వారంలో సీఎం పర్యటన..

వాసాలమర్రి ప్రజల ఐదేళ్ల నిరీక్షణకు, కన్నీళ్లకు త్వరలోనే శుభం కార్డు పడబోతోంది. జూలై రెండో వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వాసాలమర్రి గ్రామంలో పర్యటించనున్నారు. నాడు కేసీఆర్ ను నమ్మి ప్రజలు ఇళ్లు కూల్చుకుంటే నేడు రేవంత్ రెడ్డి తానే స్వయంగా 143 ఇందిరమ్మ ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు చేయించబోతున్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం ఇప్పటికే గ్రామంలో అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మొత్తానికి వాసాలమర్రి ప్రజల పాలిట కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన “ఆపద్బాంధవుడు” అనిపించుకున్నట్టయ్యింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>