కలం, జోగులాంబ గద్వాల : వడ్డేపల్లి మండలం తనగల (Tanagala) గ్రామంలో ఆదివారం భారీ దొంగతనం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన జి.అశోక్ కుమార్ అనే వ్యక్తి ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చొరబడి పెద్ద ఎత్తున బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు.
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అశోక్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం వనపర్తి జిల్లాకు వెళ్లారు. ఆదివారం తెల్లవారుజామున బాధితుడు వారు తిరిగిరాగ ఇంటి తాళాలు పగలగొట్టి, బీరువాలో ఉన్న సుమారు 13 తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు గుర్తించాడు.
ఈ ఘటనపై అశోక్ కుమార్ శాంతినగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ నాగశేఖర్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ బృందం పరిసర ప్రాంతాలు పరిశీలించాయి. అనంతరం క్లూస్ టీం ద్వారా పలు కీలక ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగశేఖర్ రెడ్డి తెలిపారు.

