కలం, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగా సమయం ఉన్నప్పటికీ, ప్రధాన పార్టీలన్నీ ఇప్పటి నుంచే పొలిటికల్ హీట్ పెంచేశాయి. ఒకవైపు బీజేపీ ‘తెలంగాణ మిషన్’ అంటుంటే, మరోవైపు బీఆర్‌ఎస్ ‘మళ్లీ వచ్చేది మేమే’ అని ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే, ఈ రెండు పార్టీల వ్యూహాలకు చెక్ పెడుతూ కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy) సరికొత్త ‘కౌంటర్ మిషన్’ ఫార్ములాను తెరపైకి తీసుకొచ్చారు.
ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేండ్లకుపైగా టైమ్ ఉండటంతో ఇప్పటి నుంచే సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల బాట పట్టారు. “ఇకపై నేను సెక్రటేరియెట్ కు మాత్రమే పరిమితం కాను. వారంలో మూడు రోజులు జిల్లాల్లోనే ఉంటాను” అని ఆయన ఆ మధ్య కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి అన్నారు. దానికి తగ్గట్టుగానే జిల్లాలను చుట్టి వస్తున్నారు. ఈ పర్యటనలతో కాంగ్రెస్ నేతల్లో కాన్ఫిడెన్స్ పెరగడంతో పాటు వారిలో కదలిక వస్తున్నదని గాంధీభవన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రతిపక్షాలను డిఫెన్సులోకి నెట్టడం ఒక ఎత్తయితే.. సొంత పార్టీలోని నేతల మధ్య విభేదాలకు ఫుల్స్టాప్ పెట్టడం సీఎం ‘కౌంటర్ మిషన్’లో భాగమని భావిస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేండ్లకుపైగా సమయం ఉన్నా అన్ని పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ మూడు రోజుల టూర్‌లో స్టేట్ లీడర్లకు దిశానిర్దేశం చేశారు. తిరిగి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ సర్వశక్తులను ఒడ్డుతున్నది. ఈ రెండు పార్టీలకు కౌంటర్‌గా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎజెండా ఫిక్స్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. తొలి రెండున్నరేండ్ల పాలన, ఎన్నికల హామీల అమలు, ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంపై దృష్టి పెట్టిన ఆయన.. సెకండ్ హాఫ్‌లో వాటితో పాటు రాజకీయ అజెండాపై ఫోకస్ పెట్టారు. సచివాలయం దాటి జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాలతో క్షేత్రస్థాయిలోని కేడర్, ప్రజలకు దగ్గరవుతున్నారు. పార్టీ యంత్రాంగాన్ని కదిలిస్తున్నారు. నిన్నమొన్నటి వరకూ జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో ప్రజా ప్రజానిధుల మధ్య, పార్టీ లీడర్ల మధ్య ఉన్న విభేదాలు, భిన్నాభిప్రాయాలు సీఎం టూర్ తర్వాత సర్దుకుంటున్నాయన్న భావన నెలకొన్నది. ఇకపై అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లను కవర్ చేసేలా సీఎం టూర్ షెడ్యూలు ఖరారు కానున్నది.
వ్యూహాత్మకంగా ముందుకు..!
రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ భవన్‌లో మే నెల 21న జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ ఒక మెసేజ్ ఇచ్చారు. “ఇకపై నేను సచివాలయానికి మాత్రమే పరిమితం కాను. వారంలో మూడు రోజులు జిల్లాల్లోనే ఉంటాను” అని ప్రకటించారు. నిస్తేజంగా, ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్న పార్టీని మళ్లీ ట్రాక్ మీదికి తేవాలన్న పక్కా వ్యూహంతోనే ఈ ప్రకటన చేశారన్నది పార్టీ వర్గాల మాట. జూన్ ఫస్ట్ నుంచే జిల్లాల పర్యటనలు ప్రారంభమయ్యాయి. అధికారిక సమీక్షలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతోనే సరిపెట్టకుండా ఒక పొలిటికల్ మెసేజ్ ఇస్తుండడంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు అజెండాను ఫిక్స్ చేస్తున్నారనే భావన కాంగ్రెస్ కేడర్ లో నెలకొన్నది. ముఖ్యమంత్రే స్వయంగా జిల్లాల్లో తిరుగుతుండటంతో కాంగ్రెస్ లీడర్లు, క్యాడర్‌లోనూ జోష్ పెరిగింది. దాదాపు రెండున్నరేండ్లుగా పార్టీ కార్యకలాపాల్లో అంటీముట్టనట్లుగా ఉన్న గ్రామస్థాయి కార్యకర్తలు మళ్లీ యాక్టివ్ అయ్యారు. స్థానిక పార్టీ నాయకత్వం సైతం ఇలాంటి బహిరంగసభలు, సీఎం టూర్ నిర్వహణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నది.
పొలిటికల్ మెసేజ్‌తో గ్యాప్ క్లోజ్
సీఎం తరచూ జిల్లాలకు వెళ్లడం, అన్ని వర్గాల నాయకులను ఒకే వేదికపైకి తీసుకురావడం, కార్యక్రమాల విజయానికి అందరూ కలిసి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడటంతో కాంగ్రెస్ నేతల మధ్య ఇంతకాలం ఉన్న అంతర్గత విభేదాలు, గ్యాప్ తగ్గిపోతున్నదని జిల్లాల పార్టీ నాయకత్వం భావిస్తున్నది. ‘కొద్దిమంది మంత్రులకు సీఎంతోనే భిన్నాభిప్రాయం ఉన్నది’.. అనే మాటలు వినిపిస్తున్న సమయంలో ఆయన ఖమ్మం, నల్లగొండ జిల్లాల పర్యటనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నాయకులు కలిసి పనిచేయాల్సి రావడం, జిల్లా స్థాయిలో సమిష్టి బాధ్యత పెరగడం పార్టీకి ప్రయోజనకరంగా మారిందనే వాతావరణాన్ని క్రియేట్ చేసిందని ఆ వర్గాలు తెలిపాయి. జిల్లాల్లో అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధుల పనితీరును సీఎం సమీక్షిస్తుండటంతో నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, పార్టీ లీడర్లు పరుగెత్తక తప్పడంలేదనే మాటలు వినిపిస్తున్నాయి.
డిఫెన్స్లోకి ప్రత్యర్థి పార్టీలు!
ప్రత్యర్థి పార్టీల రాజకీయ అటెన్షన్‌ను డైవర్ట్ చేయడం కూడా సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహంలో భాగమనే అభిప్రాయం నెలకొన్నది. అప్పులు, రైతుల సమస్యలు, గురుకుల టెండర్లు, సంక్షేమ పథకాల అమల్లో లోపాలు వంటి పలు అంశాలపై గత కొన్ని వారాలుగా ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ తీవ్రంగా ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నది. ఇలాంటి ప్రతీ సందర్భంలో ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని టేకప్ చేస్తున్నది. మహిళా స్వయం సహాయక సంఘాలకు బస్సుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల సెకండ్ ఫేజ్ ప్రారంభం, సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష, తాజాగా 20 ఏండ్ల రాజకీయ ప్రయాణం పూర్తయిన సందర్భంగా సొంత జిల్లాల్లో పలు ప్రోగ్రామ్‌లో పొలిటికల్ స్పీచ్… ఇలా ప్రభుత్వం నిరంతరం కొత్త రాజకీయ చర్చను సృష్టిస్తున్నది. దీంతో ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలు ఎక్కువకాలం ప్రజా చర్చలో నిలవలేకపోతున్నాయి. ధాన్యం కొనుగోళ్లు, హైడ్రా, మూసీ, గురుకుల టెండర్లు.. ఇలాంటి అంశాలను బీఆర్ఎస్ ఎత్తుకున్న టైమ్‌లో రేవంత్ అవలంబిస్తున్న ‘అజెండా రీప్లేస్‌మెంట్’ వ్యూహంతో హఠాత్తుగా ఆ పార్టీ ఫోకస్ మొత్తం డైవర్ట్ అయిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. నాలుగు రోజులుగా సవాళ్లు, చర్చలు, ప్రెస్‌మీట్‌లు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లతో కేటీఆర్, హరీశ్‌రావు అప్పుల అంశాలకే పరిమితమయ్యారు.
సీఎం టూర్‌తో పెండింగ్ వర్క్స్ కంప్లీట్
ముఖ్యమంత్రే క్షేత్రస్థాయిలో తిరుగుతుండడంతో జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరులో మార్పు కనిపిస్తున్నదని, కేడర్‌లో కూడా కసితో పనిచేయాలన్న వాతావరణం నెలకొన్నదని గాంధీభవన్‌లో చర్చ జరుగుతున్నది. పలు జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, లీడర్లు భేదాభిప్రాయాలను పక్కన పెట్టి ఒకే వేదిక మీదికి చేరుకుంటున్నారు. జిల్లాల్లో సీఎం పర్యటిస్తుండడంతో అక్కడి అభివృద్ధి పనులకు కదలిక వస్తున్నదని, నిధులు మంజూరవుతున్నాయని, ఎమ్మెల్యేలు సైతం గ్రామాల పర్యటనల సందర్భంగా ఈ విజయాలను ప్రస్తావించడానికి మార్గం సుగమమైందన్న వాదన ఉంది. ముఖ్యమంత్రి వస్తున్నారనే సమాచారం జిల్లా యంత్రాంగాన్ని, ప్రజాప్రతినిధులను యాక్టివ్ చేస్తున్నది. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లి పార్టీకి రాజకీయంగా ప్రయోజనం కలుగుతున్నది. సీఎం తన ప్రసంగాల్లో బీఆర్ఎస్‌ను కార్నర్ చేయడంతో అనివార్యంగా ఆ పార్టీ లీడర్లు వివరణ ఇచ్చుకోక తప్పడంలేదు. సీఎం ఫిక్స్ చేసిన అజెండాలోకి ప్రతిపక్షాలు వచ్చేస్తుండడం ఒక అంశమైతే కాంగ్రెస్‌ను ఎన్నికల మోడ్‌లోకి తీసుకొచ్చి సంస్థాగతంగా నేతల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేస్తున్నారన్నది హస్తం నేతలు అంటున్నారు.
మొత్తానికి వచ్చే ఎన్నికల్లో అధికారమే టార్గెట్‌గా బీజేపీ తలపెట్టిన ‘తెలంగాణ మిషన్’కు.. అలాగే పుంజుకోవాలని చూస్తున్న బీఆర్‌ఎస్ వ్యూహాలకు సీఎం రేవంత్ రెడ్డి తన మార్క్ ‘ఎలక్షన్ మిషన్’ను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్ లో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లను కవర్ చేసేలా సీఎం టూర్ షెడ్యూల్ ఫిక్స్ కానుండటంతో తెలంగాణ పాలిటిక్స్ మరింత రసవత్తరంగా మారనున్నాయి.

