కలం, నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ (Nagarkurnool) నియోజకవర్గంలో మొక్కజొన్న కొనుగోళ్ల పేరుతో మార్కెట్ చైర్మన్ చేసిన అవినీతిని ఆధారాలతో ప్రజల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ (BRS) నాయకులు తెలిపారు. సోమవారం అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆధారాలతో హాజరవుతామని.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్పందించి రమణారావుపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ… నాగర్ కర్నూల్ మార్కెట్ లో కృత్రిమంగా గన్నీ బ్యాగుల కొరత సృష్టించారని ఆరోపించారు. ఈ కొరతను ఆసరాగా చేసుకుని మార్కెట్ చైర్మన్ రమణరావు అనుచరులతో గన్నీ బ్యాగులను బ్లాక్‌లో విక్రయించి కోటి రూపాయలకు పైగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
అదే విధంగా ప్రభుత్వం ఒక్కో గన్నీ బ్యాగుకు రూ.22.11 రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించినా, ఇప్పటి వరకు ఒక్క రైతు ఖాతాలో కూడా డబ్బులు జమ కాలేదన్నారు. ఆ నిధులు ఎక్కడికి వెళ్లాయో ఎమ్మెల్యే, మార్కెట్ చైర్మన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. PACS కేంద్రాల ద్వారా కొనుగోళ్లు జరుగుతున్నప్పటికీ, అధికారిక సంబంధం లేకున్నా మార్కెట్ చైర్మన్ జోక్యం చేసుకుని భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం హమాలీకి ఒక్కో సంచికి రూ.26 మాత్రమే చెల్లించాలని, రవాణా, హమాలీ పేరుతో రైతుల నుంచి అదనపు వసూళ్లు చేయరాదని PACS అధికారులు స్పష్టం చేశారన్నారు. అయినా నాగర్‌కర్నూల్ మండలంలో పెద్ద ముద్దునూర్ తదితర కొనుగోలు కేంద్రాల్లో “RR టాక్స్” పేరుతో ఒక్కో సంచికి రూ.35 నుంచి రూ.50 వరకు అక్రమంగా వసూలు చేసి రూ.40 నుంచి రూ.50 లక్షల వరకు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
ఈ వ్యవహారంపై పూర్తి ఆధారాలతో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు. ఈ అవినీతిని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా అని సవాల్ చేసిన మార్కెట్ చైర్మన్ రమణరావు మాట నిలబెట్టుకోవాలన్నారు. ‘సోమవారం ఉదయం 11 గంటలకు అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆధారాలతో తాము హాజరవుతాం. దమ్ముంటే నువ్వైనా రా, లేక నీ ఎమ్మెల్యేనైనా పంపు’ అంటూ నాయకులు బహిరంగ సవాల్ విసిరారు.
ఈ మీడియా సమావేశంలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మాధవరం హన్మంతరావు, మాజీ మార్కెట్ చైర్మన్ నల్లగంటి వెంకటయ్య, మాజీ ZPTC చిక్కొండ్ర శ్రీశైలం, మాజీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, మాజీ MPPలు నర్సింహారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ మండల అధ్యక్షుడు మాధవరెడ్డి, కౌన్సిలర్ తిమ్మాజిపేట్ పాండు, మాజీ సర్పంచులు బొడ్డు రమణ, చిక్కొండ్ర నాగయ్య, రామకృష్ణారెడ్డి, BRS నాయకులు మోత్కూరి నాగార్జున, తమాటం రాజుగౌడ్, కిషోర్ గౌడ్, కట్ట వంశీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

