కలం, వెబ్ డెస్క్: రాజ్యాంగంలో ఆర్టికల్ 3 అనేది లేకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పష్టం చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే తెలంగాణ సిద్దించిందన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం నిర్వహించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి (Ambedkar Jayanti) వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. 135వ జయంతి సందర్భంగా కేటీఆర్, ఇతర నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2023 డిసెంబర్ 7వ నాడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, 2024 ఏప్రిల్ 14 నాడు హైదరాబాద్ లోని భారీ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని బందీ చేసిందని అన్నారు. 125 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే అతిపెద్దదైన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ నిర్మాణం చేశారన్న కోపంతో, ఆ మహానుభావుణ్ణి సంకెళ్లలో పెట్టి, ఎవరినీ వెళ్లనివ్వకుండా కాంగ్రెస్ బంధించిందని మండిపడ్డారు. 2025లో కూడా అదే అక్కసుతో, ఇది కేసీఆర్ కట్టిన విగ్రహం, కేసీఆర్ ఆనవాళ్లు అనే ఉద్దేశంతో మళ్ళీ రేవంత్ ప్రభుత్వం బంధించి అవమానించిందన్నారు.
కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించారు..
అందుకే ఇటీవల విద్యార్థి విభాగం నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుందని.. ‘ఒకవేళ మీరు గానీ ఈసారి బాబాసాహెబ్‌ను మళ్ళీ బందీ చేసి పెడితే, మేమే వస్తాం, వందలాదిగా వేలాదిగా వచ్చి ఆ సంకెళ్లు బద్దలు కొడతాం’ అని ఆ రోజు చేసిన హెచ్చరికతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అక్కడ ఏర్పాట్లు చేసిందన్నారు. బాబాసాహెబ్ చెప్పిన మాట: ‘బోధించు, సమీకరించు, పోరాడు’. కేసీఆర్ అదే ఆలోచనా విధానంతో లక్షల సంఖ్యలో ప్రజలను సమీకరించి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వివరించి, అడుగడుగునా పోరాడి చివరకు చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు.
1000 గురుకుల స్కూళ్లు ఏర్పాటు చేశాం..
గత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో 1000 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిందని కేటీఆర్ (KTR) తెలిపారు. దాదాపు 6.5 లక్షల మంది పిల్లలకు, సంవత్సరానికి ఒక్కొక్కరిపై 1.25 లక్షల రూపాయల చొప్పున ఖర్చు చేస్తూ వారిని ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు చేయాలని సంకల్పించిందన్నారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాటిని సరిగ్గా నిర్వహించలేకపోతోందని విమర్శించారు. ఆ గురుకులాల్లో మరణ మృదంగం మోగుతోందని ఫైర్ అయ్యారు. ఆహార కల్తీ వల్ల, ఆత్మహత్యల వల్ల 130 మందికి పైగా విద్యార్థులు మరణించడం దౌర్భాగ్యమని పేర్కొన్నారు.
Read Also: డీలిమిటేషన్‌పై కేంద్రానికి సీఎం స్టాలిన్ స్ట్రాంగ్ వార్నింగ్
Follow Us On: X(Twitter)

