పార్టీ పేరు మార్పుపై కేటీఆర్ కీలక ప్రకటన

కలం, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము పార్టీ పేరు మార్చి తప్పు చేశామని అంగీకరించారు. టీఆర్ఎస్ పార్టీగానే కొనసాగుతామంటూ బాంబు పేల్చారు. ఆదివారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ.. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చి తాము నష్టపోయామని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్‌గానే కొనసాగాలని భావిస్తున్నామని చెప్పారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ కీలక నేత కావడంతో ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయంపై చర్చ జరుగుతోంది. త్వరలో పార్టీ అధికారికంగా ఈ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. తెలంగాణ ఉద్యమసమయంలో ఈ పార్టీ కీలకంగా వ్యవహరించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం వరసగా రెండు సార్లు అధికారంలోకి కూడా వచ్చింది. కాగా తెలంగాణ రాష్ట్ర సమితి పేరును 2022 డిసెంబర్ 9న బీఆర్ఎస్ పార్టీగా మార్చారు. పార్టీ పేరు మార్చడంపై అప్పట్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ అధినేత మాటకు ఎదురుచెప్పలేక అంతా మౌనంగా ఉండిపోయారని సమాచారం.

జాతీయ రాజకీయాల కోసం

కేసీఆర్ (KCR) తన పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించే ప్రయత్నం చేశారు. జాతీయ పార్టీకి ప్రకటించుకొని వివిధ రాష్ట్రాల్లో రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. మహారాష్ట్రలో పార్టీ కార్యకలాపాలు మొదలుపెట్టారు. అక్కడి నేతలతో ప్రగతి భవన్ హడావుడిగా ఉండేది. ఇక ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు నాయకులను చేర్చుకొని ఆ రాష్ట్రంలోనూ హడావుడి సృష్టించారు. కేసీఆర్ పార్టీ పేరు మార్పు నిర్ణయం ఏ మాత్రం కలిసిరాలేదని చెప్పొచ్చు. ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరించడం అటు ఉంచితే సొంత రాష్ట్రంలోనే దారుణంగా దెబ్బతిన్నది. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం పార్టీలో అంతర్మథనం మొదలైంది. కొందరు సీనియర్ నేతలు బహిరంగంగా మీడియా ముందుకొచ్చి తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. తాజాగా కేటీఆర్ ఓపెన్ గా బీఆర్ఎస్ అంటూ పార్టీ మార్చడం తమకు చేటు చేసిందని వ్యాఖ్యానించారు. మరి త్వరలో పార్టీ పేరు మారుస్తారా? పాత పేరు టీఆర్ఎస్ ను కొనసాగిస్తారేమో వేచి చూడాలి.

ప్రస్తుతం క్యాడర్ ప్రజలు బీఆర్ఎస్ అనే పేరును ఫిక్స్ అయ్యారు. జనంలోకి ఈ పేరు వెళ్లిపోయింది. మళ్లీ టీఆర్ఎస్ (TRS) గా మార్చితే జనం ఎలా రీసివ్ చేసుకుంటారో వేచి చూడాలి. జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) సైతం త్వరలో రాజకీయపార్టీని పెట్టబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కవిత కొత్తగా పెట్టబోయే పార్టీ పేరు సైతం టీఆర్ఎస్ కావొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. కవిత కూడా మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అనే పేరును ఎవరైనా వాడుకోవచ్చని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

Read Also: కేసీఆర్‌పై ఎంపీ చామల ఫైర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>