కలం, స్పోర్ట్స్: ఇండియన్ ఉమెన్స్ లీగ్ (ఐడబ్ల్యూఎల్) 2026-27లో నీతా ఫుట్‌బాల్ అకాడమీ (Nita Football Academy) అదరగొట్టింది. జుబా సంఘ ఎఫ్‌సీపై ఏకంగా 5-0తో ఘన విజయం సాధించింది. కల్యాణి స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో నీతా జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి అర్ధభాగంలో ఇరు జట్లు గట్టి పోటీనిచ్చాయి. అయితే తొలి అర్ధభాగం అదనపు సమయంలో నీతా అకాడమీ ఖాతా తెరిచింది. నేహా (45+2′) గోల్‌తో జట్టుకు ఆధిక్యం అందించింది. రెండో అర్ధభాగంలో నీతా జోరు మరింత పెరిగింది. 52వ నిమిషంలో ప్రతిమ బంగాల్ కార్నర్ కిక్‌ను హెడర్‌తో గోల్‌గా మలిచింది. దీంతో ఆధిక్యం 2-0కు చేరింది. 83వ నిమిషంలో సిబానీ దేవి మూడో గోల్ సాధించింది. ఆ తర్వాత 89వ నిమిషంలో మటిల్డా క్వావో నాలుగో గోల్ కొట్టింది.
ఇంజ్యూరీ టైమ్‌లో భూమిక దేవి (90+2′) మరో గోల్ సాధించింది. దీంతో నీతా అకాడమీ 5-0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. ఈ విజయంతో నీతా ఫుట్‌బాల్ అకాడమీ రెండు మ్యాచ్‌ల్లో ఆరు పాయింట్లు సాధించింది. సేతు ఎఫ్‌సీ, ఈస్ట్ బెంగాల్ ఎఫ్‌సీలతో సమానంగా ఉన్నప్పటికీ మెరుగైన గోల్ తేడాతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది.

