గద్వాల జిల్లాలో కొత్తగా 4 పీఏసీఎస్‌లు.. ఆశావహులకు పదవుల పండుగ!

కలం,‌ జోగులాంబ గద్వాల: రాష్ట్రంలో 13 ఏళ్ల తర్వాత కొత్త ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS Societies) ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్‌ మినహా మిగిలిన 32 జిల్లాల్లో కొత్తగా 240 సహకార సంఘాలను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. రైతులకు సేవలను మరింత చేరువ చేసేలా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌) విభజనకు కసరత్తు మొదలైంది.

గద్వాల జిల్లాల్లో ప్రస్తుతం పుటాన్‌దొడ్డి, ఇటిక్యాల, ధరూర్, గట్టు, వడ్డేపల్లి, మానోపాడు, అలంపూర్, కలుగొట్ల,క్యాతుర్ , గద్వాల, మల్దకల్ ప్రాంతాల్లో మొత్తం 11 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా, కొత్తగా నాలుగు సంఘాలను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో గద్వాల జిల్లాలో ప్రస్తుతం ఉన్న 11 సంఘాలను విభజించి 15 సంఘాలుగా ఏర్పాటు చేయనున్నారు.

నాలుగు కొత్త సంఘాలతో జిల్లాకు ప్రయోజనం

గద్వాల జిల్లా ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. పత్తి, వరి, మొక్కజొన్న తదితర పంటల సాగుతో పాటు అనేక గ్రామాల్లో వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉంది. ఇలాంటి జిల్లాలో నాలుగు కొత్త ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఏర్పాటుకు అనుమతి లభించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీక్యాల, చిన్నతాండ్రపాడు(అయిజ), కేటీ దొడ్డి, రాజోలి ప్రాంతాల్లో కొత్త సంఘాల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో జిల్లాలో సహకార వ్యవస్థ పరిధి పెరగనుంది. ఇప్పటివరకు ఉన్న సంఘాల పరిధిలోకి రాని ప్రాంతాలకు కొత్తగా సేవలు విస్తరించే అవకాశం ఉంటుంది.

రైతులకు మరింత చేరువగా సేవలు..

కొత్త సొసైటీల (PACS Societies) ఏర్పాటు పూర్తయితే ఆయా ప్రాంతాల రైతులకు పంట రుణాలు, ఎరువులు, విత్తనాల సరఫరా, ధాన్యం కొనుగోలు వంటి సేవలు మరింత చేరువ కానున్నాయి. తెలంగాణ సహకార సంఘాల చట్టం-1964 లోని సెక్షన్లు 15-A, 43 ప్రకారం తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టి తుది ఉత్తర్వులు జారీ చేయాలని సహకార శాఖ ప్రత్యేక కమిషనర్, రిజిస్ట్రార్ను ప్రభుత్వం ఆదేశించింది.

రాజకీయంగానూ ప్రాధాన్యత..

మరోవైపు కొత్త సంఘాల ఏర్పాటు రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్‌ పార్టీలో సహకార సంఘాల ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌, డైరెక్టర్‌ పదవులను ఆశిస్తున్న నాయకుల్లో అప్పుడే ఆశలు చిగురిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో రైతులకు ఆర్థికంగా, సంస్థాగతంగా అండగా నిలిచే వ్యవస్థల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయి. గ్రామీణ స్థాయిలో రైతులకు అందుబాటులో ఉండే ఈ సంఘాల ద్వారా పంట రుణాలు, ఎరువుల పంపిణీ, వ్యవసాయ అవసరాలకు సంబంధించిన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుంది.

ఆశావహులకు పదవుల పండుగ!

నూతన సహకార సంఘాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో జిల్లాలో రాజకీయ చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్‌ పార్టీలోని నాయకులు, కార్యకర్తలు కొత్త సంఘాల్లో పదవులపై ఆశలు పెట్టుకుంటున్నారు. ఇప్పటివరకు సహకార రంగంలో అవకాశం లభించని పలువురు స్థానిక నాయకులకు కొత్త సంఘాల ఏర్పాటు రాజకీయంగా ఒక అవకాశంగా కనిపిస్తోంది.

పదవులకు పోటాపోటీ..

ప్రతి సహకార సంఘానికి పాలకవర్గం ఏర్పాటు కానుండటంతో ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌, డైరెక్టర్‌ పదవుల కోసం పోటీ ఉండే అవకాశముంది. గ్రామస్థాయిలో పార్టీకి సేవలందించిన నాయకులు, స్థానికంగా పట్టున్న నేతలు, రైతు వర్గాల్లో గుర్తింపు ఉన్నవారు ఈ పదవులపై ఆసక్తి చూపే అవకాశం ఉంది. అధికార పార్టీకి చెందిన పలువురు నాయకులు ఇప్పటికే తమ రాజకీయ పరిచయాలను ఉపయోగించుకుని పదవుల కోసం ప్రయత్నాల్లో మునిగిపోయారు. స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి పార్టీ నేతలు, సహకార శాఖలో కీలకంగా వ్యవహరించే నాయకుల మద్దతు ఎవరికి లభిస్తుందన్న అంశం చర్చనీయాంశంగా మారనుంది.

గ్రామస్థాయి రాజకీయాలకు కొత్త ఊపు

గ్రామీణ రాజకీయాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రత్యేక స్థానం ఉంది. గ్రామంలోని రైతులతో నేరుగా సంబంధాలు కలిగి ఉండే ఈ సంఘాల పాలకవర్గాల్లో చోటు దక్కించుకోవడం స్థానిక నాయకులకు రాజకీయంగా ప్రాధాన్యత కలిగిస్తుంది. సహకార సంఘం ఛైర్మన్‌ పదవి ద్వారా గ్రామస్థాయిలో గుర్తింపు పెరగడంతో పాటు రైతాంగంతో నిరంతర సంబంధాలు కొనసాగించే అవకాశం ఉంటుంది. డైరెక్టర్‌ పదవులు సైతం స్థానిక నాయకత్వానికి ఒక వేదికగా మారుతాయి. అందుకే కొత్త సంఘాల ఏర్పాటుపై రైతులతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఆశావహులు ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>