కలం, నేషనల్ బ్యూరో: రాబోయే 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (UP Assembly Elections) అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ (SP) మధ్య టఫ్ ఫైట్ నెలకొననున్నది. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గత కంటే బీజేపీ సీట్లు తగ్గనున్నాయని ప్రముఖ సర్వే సంస్థ ‘స్కోర్’ తన రౌండ్-1 ఒపీనియన్ పోల్‌లో వెల్లడించింది.
గత ఎన్నికల్లో 255 స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈసారి 177-215 స్థానాలకే పరిమితం కావచ్చని అంచనా వేసింది. 111 స్థానాలు సాధించిన సమాజ్‌వాదీ పార్టీ ఈసారి 160-202 స్థానాలకు చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది. అయినప్పటికీ ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ వచ్చే పరిస్థితి లేదని, హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలున్నాయని స్పష్టం చేసింది. మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో 42 నియోజకవర్గాల్లో పోటీ అత్యంత ఉత్కంఠభరితంగా, అక్కడ ఏ పార్టీ గెలుపునూ కచ్చితంగా అంచనా వేయలేని పరిస్థితి ఉన్నది.
తేడా 2.35% ఓట్లే..!
ఈ సర్వే ప్రకారం.. బీజేపీ సొంతంగా 177 నుంచి 215 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉండగా, ఎస్పీ 160 నుంచి 202 స్థానాలు సాధించవచ్చని అంచనా వేసింది. ఎస్పీ, కాంగ్రెస్ ఓట్లను కలిపి లెక్కిస్తే ఇండియా కూటమికి 174-219 స్థానాలు, ఎన్డీయేకు 181-226 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నది. ఇక బీఎస్పీ ఒక స్థానం, కాంగ్రెస్, జనసత్తా దళ్ (లోక్తాంత్రిక్) రెండేసి స్థానాలు దక్కవచ్చని పేర్కొన్నది.
బీజేపీ, ఎస్పీలు రెండూ విడివిడిగా దాదాపు 37 శాతం ఓట్ల మద్దతు పొందుతున్నాయని స్కోర్ వ్యవస్థాపకుడు నరేశ్ అరోరా వెల్లడించారు. కూటముల వారీగా చూస్తే ఎన్డీయేకు ఇండియా కూటమి కంటే కేవలం 2.35 శాతం పాయింట్ల ఆధిక్యం మాత్రమే ఉందన్నారు. 2022 ఎన్నికలతో పోలిస్తే ఎస్పీ ఓట్ల శాతం 32.1 నుంచి 37 శాతానికి (4.9 శాతం వృద్ధి) పెరగగా, బీజేపీ ఓట్ల శాతం 41.3 నుంచి 36.7 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు.
ప్రాంతాల వారీగా భిన్నమైన తీర్పు
పశ్చిమ యూపీ (136 స్థానాలు): ఇక్కడ బీజేపీ ఓట్ల శాతం 45.4 నుంచి 38.1 శాతానికి తగ్గినప్పటికీ.. ఎన్డీయే 84-90 స్థానాల్లో ఆధిక్యం సాధించే అవకాశం ఉంది.
పూర్వాంచల్ (141 స్థానాలు): తూర్పు యూపీలో ఎస్పీ 38.6 శాతం ఓట్లతో ముందంజలో ఉంది. బీజేపీకి 31.6 శాతం ఓట్లు వస్తాయని సర్వే పేర్కొంది.
అవధ్ (107 స్థానాలు): బీజేపీకి 40.3 శాతం, ఎస్పీకి 39.4 శాతం ఓట్ల మద్దతు ఉండటంతో ఇక్కడ పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంది.
బుందేల్‌ఖండ్ (19 స్థానాలు): కేవలం ఈ ప్రాంతంలోనే బీజేపీ ఓట్ల శాతం పెరిగి 41.1 శాతానికి చేరుకోనుంది.
మహిళలు బీజేపీ.. పురుషులు ఎస్పీ
మహిళా ఓటర్లలో 46.2 శాతం మంది ఎన్డీయేకు, 31.5 శాతం మంది ఎస్పీకి మద్దతు తెలిపారు. పురుష ఓటర్లలో మాత్రం 41.9 శాతం మంది ఎస్పీ వైపు, 35.1 శాతం మంది ఎన్డీయే వైపు మొగ్గు చూపారు. శాంతిభద్రతల అంశం బీజేపీకి కలిసి వస్తుండగా, మహిళలకు నగదు బదిలీ పథకం అమలులోకి వస్తే ఆ పార్టీకి మరింత ప్రయోజనం కలగవచ్చని ఈ సర్వే అంచనా వేసింది. కుల సమీకరణాల విషయానికొస్తే యాదవుల్లో 70.4 శాతం ఎస్పీకి, జాటవుల్లో 43.3 శాతం బీఎస్పీకి మద్దతు తెలుపుతుండగా, నాన్-యాదవ్ ఓబీసీ ఓటర్లు కీలక స్వింగ్ వర్గంగా మారనున్నారు.
సీఎంగా యోగి వైపే మొగ్గు..
తదుపరి ముఖ్యమంత్రిగా 35.3 శాతం మంది యోగి ఆదిత్యనాథ్ కు, 26.5 శాతం మంది అఖిలేశ్ యాదవ్ కు, 8.6 శాతం మంది మాయావతికి మద్దతు పలికారు. 22.7 శాతం మంది అభిప్రాయం చెప్పలేదు. అయితే వ్యక్తిగత నాయకత్వ రేటింగ్‌లో యోగికి 69.6, అఖిలేశ్‌కు 68.3 పాయింట్లు రావడంతో ఇద్దరి మధ్య ప్రజాదరణలో పెద్దగా వ్యత్యాసం లేదని స్పష్టమైంది.
సెప్టెంబర్ 16 నుంచి ఈ నెల 23 వరకు రాష్ట్రంలోని మొత్తం 403 నియోజకవర్గాల్లో 91,429 మంది ఓటర్ల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ సర్వే రూపొందించారు. ఈ గణాంకాలు ప్రస్తుత రాజకీయ పరిస్థితిని మాత్రమే ప్రతిబింబిస్తాయని, తుది ఎన్నికల ఫలితాల అంచనాగా భావించరాదని స్కోర్ సంస్థ స్పష్టం చేసింది.

