కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు.. హై కమాండ్‌కు ఫిర్యాదులు!

కలం, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్‌లో సాగుతున్న ఆధిపత్య పోరు, హై కమాండ్‌కు అందుతున్న ఫిర్యాదులపై ఏఐసీసీ కొత్త ఇన్‌ఛార్జి బీఎం సందీప్ (BM Sandeep) దృష్టి పెట్టారు. పార్టీలో నేతల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటున్నారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుస సమావేశాలు నిర్వహించిన ఆయన.. ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డితో సమావేశమయ్యారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న విభేదాలను చక్కదిద్దేందుకు సందీప్ కార్యాచరణ వేగవంతం చేశారు.

మంత్రి, ఎంపీ వివాదంపై ఆరా..

మంత్రి శ్రీధర్ బాబు-పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, మంత్రి వివేక్-మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించేందుకు బీఎం సందీప్ సిద్ధమయ్యారు. గాంధీభవన్‌లో మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణతో విడివిడిగా సమావేశమయ్యారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో నేతల మధ్య విభేదాలకు గల కారణాలను బీఎం సందీప్ ఆరా తీశారు. శ్రీధర్ బాబు, వంశీకృష్ణ మధ్య ప్రొటోకాల్ వివాదం, ఒకరిపై ఒకరు చేసుకున్న ఫిర్యాదుల వివరాలు తెలుసుకున్నారు. విభేదాలు వీడి పార్టీ అభివృద్ధికి సహకరించాలని ఆదేశించారు.

నాకు ఎవరితోనూ సమస్య లేదు: మంత్రి వివేక్

తాను ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదని సందీప్‌తో భేటీ అనంతరం మంత్రి వివేక్ వెంకటస్వామి మీడియాకు స్పష్టం చేశారు. కార్మిక శాఖ మంత్రిగా గిగ్ వర్కర్స్ కోసం అధునాతన సాంకేతికతను తీసుకొచ్చానని, సీఎం రేవంత్‌రెడ్డి సిద్దిపేట సభను విజయవంతం చేశానని తెలిపారు. తనకు ఎవరితోనూ సమస్యలు లేవని, మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వంశీ అంశం వారిద్దరికీ సంబంధించిందని పేర్కొన్నారు. తాను పార్టీ మారుతానని ప్రచారం చేసేవారికి బుద్ధి ఉండాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. పార్టీ కోసం నిరంతరం పనిచేస్తూ పెద్దపల్లిలో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేస్తానని వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>