బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో కీలక సమావేశం నిర్వహించారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఆయన ఈ సమావేశం నిర్వహించినట్టు సమాచారం. జీహెచ్ఎంసీ పరిధిలో పార్టీని ఎలా బలోపేతం చేయాలి? జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎటువంటి వ్యూహాలు అవలంభించాలి? తదితర అంశాలపై ఆయన చర్చించినట్టు సమాచారం.
తెలంగాణ భవన్(Telangana Bhavan)లో జరిగిన ఈ భేటీకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు హాజరయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, బల్దియా సమావేశంలో తీసుకోవాల్సిన వ్యూహాత్మక నిర్ణయాలు, రాబోయే ఎన్నికల దిశగా పార్టీలో ఏర్పడాల్సిన సమన్వయం లపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది.
కార్పొరేటర్లను అభినందించిన KTR
బీఆర్ఎస్ కార్పొరేటర్లను కేసీఆర్(KCR) అభినందించారు. పార్టీ ప్రజాప్రతినిధులు చూపిన క్రమశిక్షణ, ప్రజాసేవ, అవినీతిలేని పరిపాలనను ప్రత్యేకంగా కొనియాడారు. కరోనా మహమ్మారి సమయంలో కార్పొరేటర్లు చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా కార్పొరేటర్లు ప్రజా సమస్యలపై సాగించిన నిరంతర పోరాటం ప్రశంసనీయమని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బాగా పనిచేశారని కార్పొరేటర్లను అభినందించారు. చిన్న చిన్న తప్పులు జరిగాయని.. వాటిని సవరించుకొని ముందుకు సాగాలని సూచించినట్టు సమాచారం.
ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ సూచనలు
ప్రస్తుత ప్రభుత్వంపై, ముఖ్యంగా హైదరాబాద్‌కు సంబంధించిన నిర్ణయాలపై, బల్దియా సమావేశంలో దృఢంగా ప్రశ్నించాలని కేటీఆర్ సూచించారు. పరిశ్రమలకు భూముల కేటాయింపుల్లో ఉన్న అనుమానాస్పద అంశాలు రాజధానిలో ప్రభుత్వ భూముల విక్రయాల వ్యవహారం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రభుత్వ వైఫల్యాలు ఇవన్నీ సభలో స్పష్టంగా లేవనెత్తాలని ఆయన నాయకులకు ఆదేశించారు. నగర అభివృద్ధిని దెబ్బతీసే నిర్ణయాలపై అధికారులను ప్రశ్నించాల్సిన బాధ్యత కార్పొరేటర్లదేనని అన్నారు.
పార్టీ వెంటే ఉండండి
పార్టీతో కట్టుబడి పనిచేస్తే ఒక్క కార్పొరేటర్ కూడా వెనకబడబోడని కేటీఆర్ హామీ ఇచ్చారు. “పార్టీని నమ్మిన ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు, మరిన్ని పదవులు తప్పక వస్తాయి’’ అని స్పష్టం చేశారు. పార్టీ బలపడితే అందరికీ ఎదుగుదల జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ(GHMC) ఎన్నికలను ఎప్పుడైనా నిర్వహించవచ్చని, ఆ ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధిస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తక్షణమే గ్రౌండ్ లెవెల్‌లో కార్యకర్తలతో సమన్వయం పెంచి, ప్రజా సమస్యలపై మరింత చురుకుదనం ప్రదర్శించాలని సూచించారు. ఈ సమావేశం అనంతరం కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ ఇచ్చిన దిశానిర్దేశాన్ని అమలు చేస్తామని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకెళ్లే బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తామని పేర్కొన్నారు.
Read Also: బనకచర్లపై ఏపీ కొత్త ఎత్తుగడ !
Follow Us on : Pinterest


