కలం, వెబ్ డెస్క్: ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ బాధిత యువతపై జరుగుతున్న దాడులు దారుణమని కేంద్రంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతకు అండగా నిలబడేందుకే ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఉద్యమ పార్టీగా తమకు ప్రజా ఉద్యమాల పట్ల బాధ్యత ఉందని చెప్పారు. 25 రోజులుగా ఢిల్లీలో పార్టీలకు అతీతంగా యువత పోరాటం చేస్తున్నారని.. ఢిల్లీలో జరిగిన ఘటనలు అమానుషమని పేర్కొన్నారు.
ఢిల్లీలో విద్యార్థుల పోరాటానికి సంఘీభావంగా హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద విద్యార్థులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ధర్నా (BRS Protest) నిర్వహించింది. ఈ నిరసన కార్యక్రమానికి కేటీఆర్ హాజరై విద్యార్థులతో భైఠాయించి నిరసన తెలిపారు. నీట్ పేపర్ లీకేజీతో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు నివాళులర్పిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

