కలం, తెలంగాణ బ్యూరో : “దేశంలోనే ఎక్కడా లేని విధంగా 125 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని నెలకొల్పాం.. సచివాలయానికి కూడా ఆయన పేరే పెట్టుకున్నాం..” ఇదీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar) గురించి బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) తరచూ చెప్పే మాట. శంకుస్థాపన చేసిన తర్వాత ఏడేండ్లకు అంబేద్కర్ విగ్రహం కొలువుదీరింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023 ఏప్రిల్ 14న ఈ విగ్రహ ప్రారంభోత్సవానికి అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్‌ను (Prakash Ambedkar) ప్రత్యేక అతిథిగా ఆహ్వానించిన కేసీఆర్ ఆ తర్వాత విగ్రహాన్ని సందర్శించనేలేదు. అంబేద్కర్‌కు ఇచ్చే ఘనమైన గౌరవం అంటూ గొప్పగా చెప్పుకున్నా 2026 ఏప్రిల్ 14 వరకు మూడు సంవత్సరాల్లోనూ కేసీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ విగ్రహానికి నివాళులర్పించింది లేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ తెలంగాణ భవన్‌లోనే చిత్రపటానికి పూలమాలలు వేసి సరిపెట్టుకున్నారు. ప్రజల నుంచి విమర్శలు, పార్టీ శ్రేణుల నుంచి సూచనలు రావడంతో ఆలస్యంగానైనా చివరి నిమిషంలో అక్కడకు చేరుకుని నివాళులర్పించారు.
అధికారం లేనందుకే చిన్నచూపా? :
అధికారంలో ఉంటేనే విగ్రహాలు గుర్తుకొస్తాయా?.. నివాళులర్పిస్తారా?.. ప్రతిపక్షంలో ఉంటే పట్టింపు ఉండదా?.. ఇలాంటి ప్రశ్నలకు బీఆర్ఎస్ నేతల నుంచి సమాధానం కరువైంది. సుమారు 170 కోట్ల ఖర్చుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని 50 అడుగుల బేస్‌మెంట్ మీద నిర్మించిందని కేసీఆర్ (KCR) అప్పట్లో గొప్పగా చెప్పుకున్నారు. ఆ తర్వాత అంబేద్కర్ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, సీఎం బాధ్యతలు చేపట్టానని, పరిపాలనకు గుండెకాయగా ఉండే సచివాలయానికి ఆయన పేరు పెట్టుకున్నామని, తన ఛాంబర్‌లో కూర్చుంటే 125 అడుగుల ఎత్తులో కనిపించే అంబేద్కర్ విగ్రహాన్ని చూసినప్పుడల్లా ఆయన స్ఫూర్తి గుర్తుకొస్తుందని.. ఇలాంటి చాలా వ్యాఖ్యలు చేశారు. కానీ అధికారం చేజారి తర్వాత ఈ విగ్రహాన్ని సందర్శించనూ లేదు, అంబేద్కర్‌కు నివాళులు అర్పించనూ లేదు. కేసీఆర్ తన గజ్వేల్ ఫామ్‌హౌజ్‌ను అంటిపెట్టుకుని ఉన్నారు.
ఎత్తయిన విగ్రహమున్న గుర్తింపు లేదు :
గత బీఆర్ఎస్ (BR Ambedkar – BRS) ప్రభుత్వం భారీ ఖర్చుతో దేశంలోనే అత్యంత ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించినా గుర్తింపు మాత్రం అంతంతే. ఇది టూరిజం స్పాట్‌కే పరిమితమైంది. సెల్ఫీలకు, ఫొటోలకు వేదికగా మారింది. అంబేద్కర్ జీవిత చరిత్రను తెలియజేసే మ్యూజియం, సమావేశాలు నిర్వహించుకునేలా ఆడిటోరియం.. ఇలాంటివన్నీ ఉంటాయని చెప్పినా అవన్నీ మాటలకే పరిమితమయ్యాయి. సందర్శకులు సైతం బయట నుంచి చూసి సరిపెట్టుకోవడమే తప్ప దీన్ని దగ్గరి నుంచి చూసే అవకాశం లేదు. ఇంత ఎత్తయిన విగ్రహం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం టాంక్‌బండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహాన్నే గుర్తిస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా మంత్రులు, అధికారులు అక్కడే నివాళి ప్రోగ్రామ్‌కు హాజరయ్యారు. అధికారిక కార్యక్రమం ఆ చిన్న విగ్రహం దగ్గరే జరిగింది.
చివరి నిమిషంలో గులాబీ నేతల విజిట్ :
అంబేద్కర్ కృషిని గుర్తిస్తూ, గౌరవిస్తూ ఈ విగ్రహాన్ని నెలకొల్పామని గులాబీ లీడర్లు చెప్పుకున్నారు. పొలిటికల్ క్రెడిట్ కోసం చాలా స్టేట్‌మెంట్‌లు ఇచ్చారు. కానీ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ విగ్రహానికి పూలమాల వేసింది లేదు.. నివాళులర్పించింది లేదు.. కేవలం దీన్ని ఉత్సవ విగ్రహంగానే పరిగణించారు. ఇంత ఎత్తయిన విగ్రహమున్నా పార్టీ హెడ్ క్వార్టర్ తెలంగాణ భవన్‌లోనే చిన్న ఫోటో పెట్టి జయంతి వేడుకలను నిర్వహించారు. వారు కట్టిన విగ్రహాన్ని వారే గుర్తించడంలేదా?.. భారీ స్థాయిలో ప్రజాధనాన్ని ఖర్చు చేసిన నిర్మించిన ఈ మెమొరియల్‌కు వారు ఇచ్చే గౌరవం ఇదేనా?.. వారికే ఈ విగ్రహం పట్ల చిన్నచూపు ఉంటే ఇతర పార్టీలకు వేరే అభిప్రాయం ఎందుకుంటుంది?.. అధికారం లేకపోతే విగ్రహాన్ని పట్టించుకోరా?.. అంటూ జనం నుంచి విమర్శలు రావడంతో చివరి నిమిషంలో ఈ విగ్రహాన్ని విజిట్ చేసి నివాళులర్పించక తప్పలేదు. అప్పటికే ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులు బ్రోచర్‌ను విడుదల చేశారు.
Read Also: కేటీఆర్ పాదయాత్ర.. కేసీఆర్ భిన్నాభిప్రాయం
Follow Us On: Instagram

