కలం, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి (Minister Ponguleti) చెందిన ‘రాఘవ కన్‌స్ట్రక్షన్స్’ సంస్థపై ఆయన చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి.
రాఘవ కన్‌స్ట్రక్షన్స్ వారే స్వయంగా ఒక చెక్ డ్యామ్‌ను బాంబులతో పేల్చివేశారని కేటీఆర్ ఆరోపించారు. గతంలో మేడిగడ్డ ప్రాజెక్టును కూడా బాంబులు పెట్టి పేల్చారని కౌశిక్ రెడ్డి (Kaushik Reddy) చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. కేవలం బూతులు మాట్లాడుకోవడానికే సభలో ఎన్ని రోజులైనా చర్చలు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎద్దేవా చేశారు.
సీఎం రేవంత్ రెడ్డికి ప్రాజెక్టులపై కనీస అవగాహన లేదని విమర్శిస్తూ కేటీఆర్(KTR) ఘాటు వ్యాఖ్యలు చేశారు. భాక్రానంగల్ ప్రాజెక్ట్ ఎక్కడుందో ముఖ్యమంత్రికి తెలియదని, కృష్ణా నది ఎక్కడ ప్రవహిస్తుందో కూడా అధికారులను అడిగి తెలుసుకునే పరిస్థితిలో ఆయన ఉన్నారని విమర్శించారు. అంతేకాకుండా, గతంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును అడ్డుకున్న వ్యక్తిని నేడు నీటిపారుదల శాఖకు సలహాదారుడిగా పెట్టుకోవడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
నీటి పారుదల శాఖపై ప్రాథమిక అవగాహన కూడా లేని వారు, దశాబ్దాల కాలం ప్రాజెక్టుల కోసం శ్రమించిన కేసీఆర్‌ను చర్చకు రావాలని పిలవడం హాస్యాస్పదమని కేటీఆర్ కొట్టిపారేశారు. సభలో చర్చించడానికి ఎలాంటి లోతైన సబ్జెక్ట్ లేనప్పుడు, కేవలం రాజకీయ లబ్ధి కోసం ఎన్ని రోజులు సభను కొనసాగిస్తారని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.
Read Also: ఆ భయంతోనే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు : ఆది శ్రీనివాస్
Follow Us On: Youtube


