చేసిన తప్పులకు క్షమాపణేది?.. కేటీఆర్‌

కలం, తెలంగాణ బ్యూరో: గతంలో కొన్ని తప్పులు చేశాం.. ఎమ్మెల్యే సెంట్రిక్‌ రాజకీయాలతో ఓడిపోయాం.. కార్యకర్తలతో కమ్యూనికేషన్ లోపంతో నష్టపోయాం.. అంటూ మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేసిన కామెంట్లు సరికొత్త చర్చకు దారితీశాయి. తప్పులు జరిగింది నిజమేనని చెప్పి వాటిని వెల్లడించకపోవడం అనుమానాలకు తావిచ్చింది. వాటిని వెల్లడించి ఉంటే ఇంతకాలం కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు, వీటికి మధ్య స్పష్టత ఏర్పడి ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ మొదటి నుంచీ బీఆర్ఎస్‌పైన ఆరోపణలు చేస్తూనే ఉన్నది. కొన్ని తప్పుల విషయంలో ఎంక్వయిరీ కమిషన్‌లనూ నియమించింది. వాటిని ‘లొట్టపీసు కేసులు’ అంటూ కేటీఆర్ కామెంట్ చేశారు. పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ చేసిన తప్పుల జాబితాను కేటీఆర్ వెల్లడించకపోవడమే సరికొత్త చర్చకు దారితీసింది.

చేసిన తప్పులకు క్షమాపణలెక్కడ? :

తప్పులు చేశామని కామెంట్ చేసి ఒప్పుకున్నప్పుడు వాటికి క్షమాపణలు చెప్పకపోవడం రానున్న రోజుల్లో చర్చనీయాంశమయ్యే అవకాశమున్నది. గతంలో జరిగిన తప్పులపై అధ్యయనం చేశామని, లోపాలను సరిదిద్దుకుంటామంటూనే నిజాయితీని ప్రదర్శించిన కేటీఆర్ (KTR) క్షమాపణలు చెప్పడంలో ఎందుకు వెనకాడుతున్నరనేది కీలకంగా మారింది. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తరచూ చెప్పే ‘ప్రజా జీవితంలో ఉన్నవారికి విశ్వసనీయత ఉండాలి’ అనే డైలాగ్‌ ఇప్పడు తెరమీదకు వస్తున్నది. పొలిటీషియన్‌గా పబ్లిక్ లైఫ్‌లో ఉన్న కేటీఆర్ తప్పులు జరిగాయని రియలైజ్ అయ్యి వాటికి జవాబుదారీగా సారీ చెప్పకపోవడంతో ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోతారన్నది సీనియర్ పొలిటికల్ లీడర్ల వాదన. సొంత చెల్లెలు కవిత ప్రదర్శించిన చిత్తశుద్ధిని సైతం కేటీఆర్ ప్రదర్శించడంలేదని ఒక సీనియర్ నేత ప్రస్తావించారు.

కేటీఆర్ చిట్‌చాట్‌తో కాంగ్రెస్‌కు నైతిక బలం :

మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లిలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా కేటీఆర్ చేసిన కామెంట్లే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నైతిక బలాన్ని చేకూర్చినట్లయింది. పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ తప్పులు చేసి రాష్ట్రానికి, ప్రజలకు అన్యాయం చేసిందంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా పలువురు మంత్రులు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. కాళేశ్వరం అవినీతి, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ-రేస్, చత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్ళలో అవకతవకలు.. ఇలాంటి పలు అంశాలపై ఎంక్వయిరీ కమిషన్‌లు, ‘సిట్’ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించింది. కేటీఆర్ ప్రస్తావించిన తప్పులను బహిర్గతపర్చి ఉంటే కాంగ్రెస్ ఎంక్వయిరీ చేయిస్తున్నవి కూడా వాటిపైనేనా స్పష్టత వచ్చి ఉండేదన్న వాదనా వినిపిస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పులకు తానూ భాగస్వామినే అంటూ కల్వకుంట్ల కవిత ఓపెన్‌గా చెప్పినప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ చెప్పడానికి అడ్డొస్తున్నదేంటనే గుసగుసలూ గులాబీ లీడర్లలో వినిపిస్తున్నాయి.

Read Also: అండర్ ట్రయల్ ఖైదీ.. జైల్లోనే బందీ!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>