కలం, తెలంగాణ బ్యూరో : ఎట్టి పరిస్థితుల్లో జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టవద్దని ప్రధాని నరేంద్ర మోడీకి (PM Modi) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) లేఖ రాశారు. లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల డీలిమిటేషన్ (Delimitation) కోసం జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటే బీజేపీకి తాత్కాలికంగా స్వల్పకాలం వరకు ప్రయోజనం కలగవచ్చేమోగానీ దక్షిణాది రాష్ట్రాలకు, చిన్న రాష్ట్రాలకు మాత్రం దీర్ఘకాలం అన్యాయం జరుగుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ విధానం మొత్తం దేశాన్నే బలహీనపరుస్తుందన్న ఆందోళనను వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్లను సాకుగా చూపుతూ ఇప్పుడు దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ చేపట్టడం సహేతుకమైనది కాదన్నారు. ఎప్పుడైనా పార్టీ ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలే మిన్నగా ఉండాలన్నారు. లోక్‌సభ పునర్విభజన కోసం కేవలం జనాభా నిష్పత్తిని మాత్రమే కాకుండా, ఇతర నమూనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం సుదీర్ఘంగా అన్ని కోణాల నుంచి విశ్లేషించి విస్తృతమైన దృక్పథంతో నిర్ణయం తీసుకోవాలని నొక్కిచెప్పారు.
మహిళా రిజర్వేషన్లను తక్షణం అమలు చేయాలి :
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు (Women Reservations) కల్పించే అంశంలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన అభిప్రాయం ఉన్నదని, దీన్ని స్వాగతిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆ లేఖలో కోరారు. వెంటనే మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలులోకి తేవాలని స్పష్టం చేశారు. లోక్‌సభ స్థానాల నియోజకవర్గాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలకు అనేక రకాల భిన్నాభిప్రాయాలు ఉన్నందున మహిళా రిజర్వేషన్ చట్టంతో ముడిపెట్టవద్దని, ఈ రెండూ వేర్వేరు అంశాలని నొక్కిచెప్పారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ ఈ రెండు అంశాలపై స్పష్టత ఉన్నదని గుర్తుచేశారు. రాష్ట్రాల వారీగా అసెంబ్లీ స్థానాల్లో మహిళా కోటాను వెంటనే అమలు చేస్తే దేశమంతా స్వాగతిస్తుందన్నారు. డీలిమిటేషన్ కోసం ప్రత్యామ్నాయాలపై కొన్ని సూచనలను తెలియజేశారు. అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకుని జాతీయ ఏకాభిప్రాయాన్ని నిర్మించాలని ఆ లేఖలో కోరారు.
Read Also: చేసిన తప్పులకు క్షమాపణేది?.. కేటీఆర్
Follow Us On: Facebook

