కలం, స్పోర్ట్స్ : టీమిండియా ఫ్యాన్స్‌కు కర్ణాటక ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వెటరన్ ప్లేయర్స్ అనిల్ కుంబ్లే (Anil Kumble) , రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) కు అరుదైన గౌరవం అందిస్తున్నట్లు ప్రకటించింది. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం (Chinnaswamy Stadium) లో వారి పేర్లు చిర స్థాయిగా నిలిచే నిర్ణయాన్ని తీసుకున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. ఈ స్టేడియంలో రెండు స్టాండ్లకు అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్ పేర్లను పెట్టినట్లు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అధికారికంగా ప్రకటించింది.
ఈ నిర్ణయం మాజీ భారత పేసర్ వెంకటేషన్ ప్రసాద్ పదవీకాలంలో తీసుకున్నారు. కర్ణాటక క్రికెట్ ఎదుగుదలలో ద్రవిడ్, కుంబ్లే (Dravid – Kumble) చేసిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం అందించారు. కుంబ్లే అంతర్జాతీయ కెరీర్‌లో 401 మ్యాచ్‌ల్లో 953 వికెట్లు సాధించారు. టెస్టులు, వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచారు. ఈ గుర్తింపు వ్యక్తిగత విజయంకన్నా కర్ణాటక క్రికెట్ ప్రయాణానికి ప్రతీక అని ఆయన భావించారు. ఆటగాళ్లు, సంఘం కలిసి ఎదిగాయని, స్టేడియంలో అందరి కృషి శాశ్వతంగా నిలిచిందని తెలిపారు.
ద్రవిడ్.. చిన్న స్వామి మైదానాన్ని తన రెండో ఇల్లు అని గుర్తు చేసుకున్నారు. టెస్టుల్లో సచిన్ టెండూల్కర్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందిన ద్రవిడ్ 504 మ్యాచ్‌ల్లో 24,064 పరుగులు సాధించారు. ఈ మైదానంలోనే ఆనంద క్షణాలు, నిరాశ క్షణాలు రెండూ అనుభవించినట్టు చెప్పారు. చిన్నతనంలో తండ్రి వెంట వచ్చి మ్యాచ్‌లు చూసిన రోజులు గుర్తుచేసుకుంటూ ఈ గౌరవం ఆయనకు ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు.
ఇదే స్టేడియంలో భారత మహిళా క్రికెట్‌కు మార్గదర్శకురాలైన శాంతా రంగస్వామి పేరుతో మరో స్టాండ్ ఏర్పాటు చేయనున్నారు. ఆమె భారత మహిళా క్రికెట్‌లో తొలి టెస్ట్ సెంచరీ సాధించిన ఘనత కలిగి ఉన్నారు. 1976 నుంచి 1991 మధ్య 16 టెస్టులు, 19 వన్డేల్లో 1,037 పరుగులు చేశారు. మహిళా క్రికెట్‌కు ఆమె చేసిన సేవలకు ఇది ముఖ్యమైన గుర్తింపుగా నిలుస్తోంది. ఈ కార్యక్రమం కర్ణాటక క్రికెట్ చరిత్రలో మరో మైలురాయిగా మారింది. దిగ్గజాల కృషిని గుర్తు చేస్తూ, రాబోయే తరాలకు ప్రేరణగా నిలుస్తుందని క్రీడా వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
Read Also: మహాశివరాత్రి రోజు ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి!
Follow Us On : WhatsApp


