కలం, నల్లగొండ బ్యూరో : నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ (Nalgonda Corporation)ను కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. ముందు నుంచి ఊహించినట్టుగానే తొలి మేయర్ పదవిని దక్కించుకుంటామని కాంగ్రెస్ చెబుతూ వచ్చింది. అందుకు అనుగుణంగానే 27 స్థానాలతో తొలి మేయర్ పదవిని తమ ఖాతాలో వేసుకుంది. అయితే నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవికి అభ్యర్థిగా బుర్రి చైతన్య-శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ముందుగానే ప్రకటించారు. పార్టీ క్యాడర్‌తో పాటు ఆశావాహ అభ్యర్థులకు సైతం ముందుగానే క్లారిటీ ఇచ్చారు. కానీ డిప్యూటీ మేయర్ పదవిని పెండింగ్‌లో పెట్టారు. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఏకపక్షంగా మేజిక్ ఫిగర్‌కు కావాల్సిన సీట్లను సాధించడంతో మేయర్‌గా బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి పేరు అధికారికంగా ప్రకటించడమే తరువాయిగా మిగిలింది. చైతన్యశ్రీనివాస్ రెడ్డి ప్రమాణస్వీకారం సైతం దాదాపు ఖరారయ్యింది. అయితే డిప్యూటీ మేయర్ ఎవరనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
బీసీలకా.. ముస్లిమ్ మైనార్టీలకా..?
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ (Nalgonda Corporation) డిప్యూటీ మేయర్ ఎవరనేది కాంగ్రెస్ పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని రేపుతోంది. మేయర్ పదవిని రెడ్డి సామాజికవర్గానికి కేటాయించడంతో డిప్యూటీ మేయర్ పదవి ఎవరిని వరిస్తుందోనని అంతా వెయిట్ చేస్తున్నారు. మొదట నల్లగొండలో బీసీలకు మేయర్ పదవి ఇవ్వాలంటూ బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. కానీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం మేయర్ అభ్యర్థిగా బుర్రి చైతన్యశ్రీనివాస్ రెడ్డిని ప్రకటించారు. దీంతో కనీసం డిప్యూటీ మేయర్ పదవినైనా బీసీలకు కేటాయించాలనే డిమాండ్ విన్పిస్తోంది. అయితే ఈ రేసులోకి మాజీ మున్సిపల్ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మీ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ పేర్లు బీసీ సామాజికవర్గం నుంచి విన్పిస్తుంది.
డిప్యూటీ మేయర్‌గా ఇబ్రహీం పేరు తెరపైకి..
ఇదే సమయంలో డిప్యూటీ మేయర్ (Deputy Mayor) పదవిని ముస్లిమ్ మైనార్టీలకే కేటాయించాలనే డిమాండ్ బలంగా విన్పిస్తోంది. అందులో భాగంగానే 21వ వార్డు నుంచి పోటీ చేసి గెలిచిన ఇబ్రహీమ్‌కు డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వాలని ముస్లిమ్ మైనార్టీలు విజ్ఞప్తి చేస్తున్నారు. నల్లగొండ జనాభాలో కీలకంగా ఉండే ముస్లింలకు డిప్యూటీ మేయర్ పదవిని కట్టబెడితే ఆ వర్గాలు అభివృద్ధి చెందడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి మరింతగా కలిసి వస్తుందని భావిస్తున్నారు. ముస్లిమ్ ల నుంచి ఐదుగురు కౌన్సిలర్ అభ్యర్థులుగా విజయం సాధించారు. 21వ వార్డు నుంచి గెలిచిన ఇబ్రహీమ్ సైతం తన ప్రత్యర్థిపై ఏకంగా 1300 పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలవడం గమనార్హం. అయితే డిప్యూటీ మేయర్ పదవిని ఎవరికి కట్టబెడతారనేది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy) తేల్చాల్సి ఉంది. ఇదిలావుంటే.. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 48 డివిజన్లు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ 27 స్థానాలు గెలుచుకోగా, బీఆర్ఎస్ 9 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక బీజేపీ 4 స్థానాల్లో గెలిస్తే.. 8 స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు.
Read Also: 15 ఏళ్లు సహజీవనం చేసి.. ప్రేమికుల రోజు చంపేశాడు
Follow Us On: Instagram


