epaper
Wednesday, February 18, 2026
epaper

మహాశివరాత్రి రోజు ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి!

కలం, వెబ్​ డెస్క్​ : ఈ ఏడాది మహాశివరాత్రి (Maha Shivaratri) ఫిబ్రవరి 15, ఆదివారం వచ్చింది. మాఘ మాస శుక్ల పక్ష చతుర్దశి తిథిన వచ్చే ఈ పవిత్ర పర్వదినం పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు. తాజా అప్‌డేట్‌గా రాష్ట్రవ్యాప్తంగా భక్తులు ఉపవాసాలు, అభిషేకాలు, జాగరణలతో శివారాధనకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా జ్యోతిష్యులు మహాశివరాత్రి ప్రాముఖ్యతను వివరించారు. సరైన విధానంలో పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ఆయన తెలిపారు.

పంచగవ్య అభిషేకం – సంపూర్ణ శివానుగ్రహానికి మార్గం

మహాశివరాత్రి రోజు అనేక రకాల ద్రవ్యాలతో అభిషేకాలు చేస్తారు. అయితే అన్నింటికంటే శ్రేష్ఠమైనది పంచగవ్య అభిషేకమని శివపురాణంలోని విద్యేశ్వర సంహిత చెబుతుందని మాచిరాజు తెలిపారు. పంచగవ్య అంటే ఆవు పాలు, పెరుగు, నెయ్యి, గోమయం, గోమూత్రం. ఈ ఐదింటితో శివలింగానికి అభిషేకం చేస్తూ “నమః శివాయ” పంచాక్షరి మంత్రం జపిస్తే జన్మజన్మల పుణ్యం లభిస్తుందని వివరించారు. ఇది వీలుకాని వారు నీటిలో విభూతి కలిపి భస్మాభిషేకం చేసినా ఆయురారోగ్యాలు, అష్టఐశ్వర్యాలు పొందవచ్చని చెప్పారు.

ఏ పూలతో పూజ చేయాలి?

మహాశివరాత్రి (Maha Shivaratri) రోజు సంపంగి, మొగలి పూలు తప్ప మిగతా అన్ని పుష్పాలతో శివుడిని పూజించవచ్చని తెలిపారు. మారేడు దళాలతో అర్చన చేయడం అత్యంత శుభప్రదమని వివరించారు. మారేడు దళాలతో చేసిన పూజ వల్ల పాపక్షయం కలుగుతుందని చెప్పారు.

దీపారాధన విధానం

మారేడు దళాలపై కుందులు పెట్టి దీపారాధన చేయడం మంచిదని తెలిపారు. ఏ నూనె వాడినా అందులో కొద్దిగా ఆవునెయ్యి కలిపితే శుభఫలితాలు పెరుగుతాయని చెప్పారు. పూర్తిగా ఆవునెయ్యితో దీపాలు వెలిగిస్తే మరింత విశేష ఫలితాలు వస్తాయని వివరించారు.

ఉపవాసం ఎలా ఉండాలి?

ఉపవాసం రెండు రకాలుగా ఉంటుందని తెలిపారు.ఒకటి ఆహారం తీసుకోకుండా ఉండటం. రెండవది శివ ధ్యానంలో ఉండటం. 12 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు దాటినవారు, గర్భిణులు, బాలింతలు, అనారోగ్యంతో ఉన్నవారు ఆహార ఉపవాసం చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. వీరు శివనామస్మరణ చేస్తూ మానసిక ఉపవాసం చేయాలని సూచించారు. మిగిలిన వారు పాలు, పండ్లు మాత్రమే తీసుకుంటూ ఉపవాసం ఉండవచ్చని తెలిపారు.

నిజమైన జాగరణ అంటే ఇదే

జాగరణ అంటే కేవలం మేల్కొని ఉండటం కాదని స్పష్టం చేశారు. శివనామస్మరణ, శివస్తోత్రాలు, ఆలయ దర్శనం, ఇంట్లో పూజ వంటి శివసంబంధ కార్యక్రమాల్లోనే రాత్రంతా గడపాలని చెప్పారు. వినోద కార్యక్రమాలతో చేసే జాగరణ అసలైనది కాదని వివరించారు.

మానసిక శివపూజ కూడా మహాఫలితం

పూజ చేయలేని వారు మానసిక శివపూజ చేయవచ్చని తెలిపారు. సమస్త విశ్వాన్ని శివలింగంలా భావించి చంద్రుడి నుంచి అమృతధార పడుతున్నట్లు ధ్యానించాలి. మనస్సులోనే అభిషేకం చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పారు.

మహా శివరాత్రి రోజు తప్పక చేయాల్సిన పనులు

ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. వీలైతే శివాలయ దర్శనం చేయాలి. మారేడు దళాలతో అర్చన చేయాలి. “ఓం నమః శివాయ” జపం కనీసం 108 సార్లు చేయాలి. శివపురాణం లేదా లింగ పురాణం కథలు వినాలి. పేదలకు అన్నదానం చేయాలి. ఆవులకు గడ్డి లేదా పండ్లు పెట్టాలి. కోపం, అసత్యం, నెగటివ్ ఆలోచనలు దూరంగా ఉంచాలి.

శివరాత్రి మరుసటి రోజు పాటించాల్సిన నియమాలు

మరుసటి రోజు ఉదయం కూడా శివపూజ చేసి సాయంత్రం చంద్రుడు కనిపించిన తర్వాత అన్నదానం చేసి భోజనం చేయాలని తెలిపారు. వీలైనంతవరకు పగటిపూట నిద్రపోకూడదని చెప్పారు. శివపార్వతుల కల్యాణ దర్శనం చేసినా విశేష ఫలితాలు ఉంటాయని వివరించారు.

లింగ పురాణం ప్రకారం నిష్కల్మష భక్తితో ఉపవాసం, జాగరణ చేస్తూ మారేడు దళాలతో శివయ్యను పూజించిన వారికి తప్పకుండా శివానుగ్రహం లభిస్తుందని జ్యోతిష్యులు తెలిపారు. మహాశివరాత్రి రోజున నియమ నిష్ఠలతో శివారాధన చేస్తే పరమేశ్వరుడి అనుగ్రహంతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ఆధ్యాత్మిక వర్గాలు పేర్కొంటున్నాయి.

Read Also: ఇంట్లో పూజించే విగ్రహాలు అంతకుమించి ఎత్తు ఉండకూడదా..!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>