కలం, ఖమ్మం బ్యూరో: మారుతున్న కాలంతో పాటు వ్యవసాయ రంగం కూడా సరికొత్త సాంకేతిక పుంతలు తొక్కుతోంది. ప్రస్తుత రోజుల్లో రైతాంగాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్యలైన పంట తెగుళ్లు, కూలీల కొరత, వాతావరణ మార్పులకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ హైదరాబాద్‌కు చెందిన “ఆగ్రి బ్రిడ్జి” సంస్థ ఒక అద్భుతమైన ఆవిష్కరణను తీసుకువచ్చింది. కంటికి కనిపించని మొక్కల జబ్బులను సైతం పసిగట్టగలిగే టెక్నాలజీతో ఈ సంస్థ రూపొందించిన ‘క్రిషివాస్’ (KrishiVaas AI App) మొబైల్ యాప్ ఇప్పుడు సాగు రంగంలో సరికొత్త సంచలనంగా మారింది. శాటిలైట్ డేటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత ఆధారంగా రైతులకు డిజిటల్ అండగా నిలుస్తూ వ్యవసాయాన్ని సులభతరం చేస్తోంది.
సాధారణంగా పంటకు సోకే తెగుళ్లు పైకి కనిపించే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కానీ, క్రిషివాస్ యాప్ ద్వారా ప్రపంచంలోనే మొదటిసారిగా పంటలో రాబోయే సమస్యను ముందస్తుగానే గుర్తించే సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు. పంట బయటకు ఆరోగ్యంగా కనిపించినప్పటికీ, దాని అంతర్గతంగా ఉన్న రోగాలను, అంటే న్యూట్రిషన్ లోపం, నీటి ఎద్దడి వంటి మొక్కల ఒత్తిడిని సైతం ఈ యాప్ ముందే పసిగడుతుంది. అంతటితో ఆగకుండా, ఆ వ్యాధి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో, ఏ మందులు పిచికారీ చేయాలో కూడా సిఫార్సు చేస్తుంది. దీనివల్ల రైతులు సరైన సమయానికి స్పందించి తమ పంటలను సంరక్షించుకునే అవకాశం లభిస్తుంది.
ఈ సాంకేతికతలోని మరో గొప్ప విశేషం ఏమిటంటే, రైతు అసలు పొలం దగ్గరకు వెళ్లకుండానే తన మొబైల్ ఫోన్ ద్వారా పంట స్థితిగతులను నిరంతరం పర్యవేక్షించవచ్చు. అంతరిక్షంలోని శాటిలైట్ డేటా, ఏఐ సాయంతో 3×3 మీటర్ల పిక్సెల్స్ గల ఉపగ్రహ చిత్రాల సహాయంతో పంటల ఆరోగ్యాన్ని నిరంతరం గమనించడం వల్ల, పొలంలో ఏ నిర్దిష్ట ప్రాంతంలో, ఏ మొక్కకు సమస్య ఉందో ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. దీనివల్ల కూలీల కొరత ఉన్నప్పటికీ కేవలం ఆ సమస్య ఉన్న చోటుకే వెళ్లి మందులు పిచికారీ చేసే వీలుంటుంది. ఫలితంగా పురుగుల మందుల ఖర్చును దాదాపు 50% వరకు తగ్గించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది పెట్టుబడి ఖర్చును తగ్గించడమే కాకుండా అధిక దిగుబడి సాధించడానికి మార్గం సుగమం చేస్తుంది.
ఈ వినూత్న సాంకేతికతను క్షేత్రస్థాయిలో పరీక్షించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ‘కృషివాస్’ యాప్ పైలట్ ప్రాజెక్ట్‌ను 2025 నవంబర్ లో ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రక్రియలు, సన్నాహక సమావేశాలు విజయవంతంగా జరిగాయి. ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద దమ్మపేట మండలంలోని 22 గ్రామాల్లో దాదాపు 56,000 ఎకరాల సాగు భూమిని, 12 వేల మందికి పైగా రైతులను ఈ డిజిటల్ వేదికపైకి అనుసంధానించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోంది. ఈ మండలంలో ప్రధానంగా ఆయిల్ పామ్, వరి, మొక్కజొన్న వంటి వివిధ పంటలపై ఈ సాంకేతికత పనితీరును సమగ్రంగా అధ్యయనం చేస్తున్నారు.
కేవలం తెగుళ్ల గుర్తింపు మాత్రమే కాకుండా, రైతులకు అవసరమైన మరిన్ని అద్భుతమైన సదుపాయాలను ఈ యాప్‌లో పొందుపరిచారు. వాతావరణ హెచ్చరికలు, నేల ఆకులలోని తేమ శాతానికి సంబంధించిన సమాచారాన్ని ఇది ఎప్పటికప్పుడు అందిస్తుంది. ముఖ్యంగా ఆయిల్ పామ్ తోటల పెంపకందారులకు అత్యంత ప్రయోజనకరంగా ఉండేలా, ఇందులోని టెక్నాలజీ ప్రతి ఒక్క చెట్టుకు సంబంధించిన సమాచారాన్ని విడివిడిగా ట్రాక్ చేస్తుంది. ఇప్పటికే సుమారు 75కు పైగా రకాల పంటలలో విజయవంతంగా పరీక్షించబడిన ఈ క్రిషివాస్ యాప్, ముందస్తు సమాచారం అందించడం ద్వారా నష్టం జరగకముందే రైతులను అప్రమత్తం చేస్తూ సాగు రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపింది.
పెరుమాళ్ళ వీరభద్రరావు, అంకంపాలెం, దమ్మ పేట మండలం
దమ్మపేట మండలం లో “కృషివాస్” యాప్ ను మొట్టమొదట డౌన్ లోడ్ చేసుకున్నది నేనే. మా ఊరి సర్పంచ్ చెబితే డౌన్ లోడ్ చేసుకున్నాను. అంతకుముందు ఈ యాప్ కు సంబంధించిన సిబ్బంది, నా పేరు పోన్ నెంబర్ ను రిజిస్టర్ చేసుకున్నారు. ఈ యాప్ ను పొలంలో ఉండే డౌన్ లోడ్ చేసుకోవాలి. అప్పుడే డౌన్ లోడ్ అవుతుంది. నిన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోన్ లో మాట్లాడారు. ఏ పంట ఎన్ని ఎకరాల్లో వేశావు అని అడిగారు. రెండున్నర ఎకరాల్లో పామాయిల్ కౌలు కు తీసుకున్నానని చెప్పాను. యాప్ పని తీరు గురించి వివరాలు అడిగారు. “పొలంలో ఉండి యాప్ ఓపెన్ చేయగానే సమస్య ఉన్న మొక్క దగ్గరికి జీ పీ ఎస్ ఆధారంగా తీసుకెళ్తుంది.
అలా వెళ్ళి చూడగా ఆ మొక్కకు మోగి పురుగు సోకినట్లు గమనించాను.ఈ యాప్ లేకపోతే ఆ సమస్య గుర్తించడానికి చాలా సమయం పట్టేది. వెంటనే ఆ భాగాన్ని పోటో తీసి యాప్ లో అప్ లోడ్ చేశాను. నివారణకు కావలసిన క్రిమి సంహారక మందులు కూడా యాప్ తెలియజేసింది. అని మంత్రి గారికి వివరించాను”.మందు ఎలా పిచికారి చేశావని అడిగారు. సమస్య ఉన్న భాగంలో మాత్రమే కూల్ డ్రింక్ బాటిల్ తో కర్ర సహాయంతో మందు వేశానని చెప్పాను.దీని వల్ల మందుల దుర్వినియోగం కూడా తగ్గింది.
కృషివాస్ ఆపరేషనల్ అసిస్టెంట్ మేనేజర్, దమ్మ పేట
దమ్మ పేట మండలం లో 20 మంది కృషివాస్ సిబ్బంది, రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. మండలంలో 12 వేల మంది రైతులు ఉన్నారు. వీరిలో 7,500 మందికి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఇందులో 5వేల మంది ఇప్పటికే యాప్ డౌన్ లోడ్ చేసుకుని ప్రయోజనం పొందుతున్నారు. కొమ్ము పురుగు, బోరాన్, మెగ్నీషియం,పొటాషియం డెఫిషియన్సీ నీ యాప్ గుర్తించి రైతులను అలెర్ట్ చేస్తుంది. వాటి నివారణకు కావలసిన మందులు చెప్పడంతో పాటు అవి ఎక్కడ దొరుకుతాయో కూడా చెప్తుంది. ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకున్న రైతులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

