పచ్చదనమే లక్ష్యంగా జిల్లాలో 57.70 లక్షల మొక్కలు నాటాలి: నల్లగొండ కలెక్టర్

కలం, నల్లగొండ: మొక్కలు మానవ మనుగడకు మూలాధారమని, పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని నల్లగొండ కలెక్టర్ (Nalgonda Collector) బి.చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. గురువారం కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస రెడ్డి కలిసి మొక్కలు నాటారు. జిల్లాలో వనమహోత్సవ కార్యక్రమం ముమ్మరంగా ప్రారంభమైందని కలెక్టర్ తెలిపారు.

గతేడాది జిల్లాలో 90 శాతం మొక్కలు నాటి అనుకున్న లక్ష్యాన్ని సాధించామని, ఈ సంవత్సరం వంద శాతం లక్ష్యాన్ని చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 57 లక్షల 70 వేల మొక్కలు నాటాలని పటిష్ట లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు పేర్కొన్నారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ సంవత్సరం 1.65 లక్షల మొక్కలు నాటేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

కార్పొరేషన్ పరిధిలోని ఖాళీ స్థలాలు (ఓపెన్ ప్లాట్స్), పార్కులు, రోడ్ల ఇరువైపులా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సూచించారు. చారిత్రాత్మక లతీఫ్ సాబ్ గుట్టపై ఎలాంటి మొక్కలు నాటితే బాగుంటుందనే అంశంపై జిల్లా అటవీ అధికారి ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నారని కలెక్టర్ (Nalgonda Collector) వెల్లడించారు. ఇంటి ఆవరణలో ప్రతి ఇల్లాలు 6 మొక్కలు నాటాలని, ఈ హరిత యజ్ఞంలో మహిళల పాత్ర కీలకమని స్పష్టం చేశారు.

అనంతరం మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస రెడ్డి (Burri Chaitanya) మాట్లాడుతూ.. నగరాల విస్తరణ, పెరుగుతున్న నిర్మాణాల వల్ల మొక్కల సంఖ్య తగ్గిపోతోందని మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో దాదాపు 5000 కోట్ల మొక్కల అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆమీర్ అలీ, జిల్లా అటవీ అధికారి రాజశేఖర్ పాల్గొని ప్రసంగించారు. వీరితో పాటు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, జేసీ శ్రీనివాస్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శరత్ చంద్ర, డి.ఐ.ఇ.ఓ దశ్రు నాయక్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, మున్సిపల్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటారు.

Read Also: హైడ్రాను భూతంగా ప్రచారం చేస్తున్నారు: సీఎం రేవంత్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>