కలం, ఖమ్మం బ్యూరో: కొత్తగూడెం పట్టణ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్న కోతుల బెడదకు చరమగీతం పాడేందుకు నగర పాలక సంస్థ ‘మంకీ ఫ్రీ’ మిషన్‌ను వేగవంతం చేసింది. మేయర్ మూడ్ గణేష్ (Mayor Mood Ganesh) ఆధ్వర్యంలో అన్ని డివిజన్లలో ప్రత్యేక బోన్లు ఏర్పాటు చేసి, బోన్లలో చిక్కిన కోతులను అటవీ ప్రాంతాలకు తరలించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శనివారం 16వ డివిజన్ రామవరం అంబేడ్కర్ చమన్ వద్ద ప్రత్యేక బోన్లను ఏర్పాటు చేయగా, మేయర్ స్వయంగా హాజరై ప్రక్రియను పరిశీలించారు.
60 డివిజన్లలో కోతుల సమస్య..
ఈ సందర్భంగా మేయర్ మూడ్ గణేష్ మాట్లాడుతూ… కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో కోతుల సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాలను ఇప్పటికే గుర్తించామన్నారు. పరిష్కారం కోసంనిపుణుల బృందాలను రప్పించినట్లు వెల్లడించారు. పలు ప్రాంతాల్లో కోతుల దాడుల్లో ప్రజలు గాయపడిన ఘటనలు తమ దృష్టికి వచ్చాయన్నారు. స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆదేశాలతో పాటు ప్రజాప్రతినిధులు, బాధితుల విజ్ఞప్తుల మేరకు యుద్ధప్రాతిపదికన ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ, మాజీ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

