కలం, భద్రాచలం: భద్రాచలం గోదావరి తీరంలో గణనాథుల నిమజ్జన (Ganesh Immersion ) ప్రక్రియ తీవ్ర జాప్యమవుతోంది. నవరాత్రులు విశేష పూజలందుకున్న బొజ్జ గణపయ్యల విగ్రహాలు నిమజ్జనం కోసం భారీగా గోదావరి తీరానికి చేరుకున్నప్పటికీ, అధికారుల అరకొర ఏర్పాట్ల వల్ల తీవ్ర నిరీక్షణ తప్పడం లేదు. గోదావరి లోపలికి విగ్రహాలను తీసుకెళ్లి నిమజ్జనం చేయడానికి అధికారులు కేవలం ఒకే ఒక్క లాంచీని అందుబాటులో ఉంచడమే ఈ ఆలస్యానికి ప్రధాన కారణమైంది. శనివారం తీరం వద్ద సుమారు 400కి పైగా విగ్రహాలు నిమజ్జనం కోసం క్యూ లైన్లలో వేచి ఉన్నాయి. పోలీసుల సహాయంతో అధికారులు దగ్గరుండి ప్రక్రియను పర్యవేక్షిస్తున్నప్పటికీ, ఒకే లాంచీ ఉండటంతో నిమజ్జనం చాలా మందకొడిగా సాగుతోంది.
దీనికి తోడు నిమజ్జన పద్ధతిపై కూడా భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. లాంచీ కొరత వల్ల విగ్రహాలను వాహనాల నుంచి కిందకు దించి, భక్తుల సమక్షంలో కాకుండా ఆ తర్వాత తీసుకెళ్లి నిమజ్జనం చేస్తున్నారు. తమ స్వామికి వీడ్కోలు పలికే ఘట్టాన్ని కళ్లారా చూడలేకపోతున్నామని, గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని భక్తులు తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే అదనపు లాంచీలను ఏర్పాటు చేసి నిమజ్జన ప్రక్రియను వేగవంతం చేయాలని, భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఉత్సవ కమిటీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

