కలం, ఖమ్మం బ్యూరో : ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా, ముందస్తు అనుమతులు లేకుండా నడిపే ప్రైవేట్ వైద్య సంస్థలపై కఠిన చర్యలు తప్పవని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డా. తుకారం రాథోడ్ హెచ్చరించారు. శనివారం ఆయన అన్నపురెడ్డిపల్లి (Annapureddypalli) మండల పరిధిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. స్థానిక ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లను తనిఖీ చేసిన ఆయన, ఎలాంటి ప్రభుత్వ నమోదు లేకుండా నిర్వహిస్తున్న ఒక సెంటర్ను గుర్తించి, మూడు రోజుల్లోగా వివరణ సమర్పించాలని నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. ప్రజల ఆరోగ్య నిర్ధారణ సేవల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అనంతరం ఎర్రగుంట పీ హెచ్ సీ పరిధిలోని అన్నపురెడ్డిపల్లి సబ్ సెంటర్ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రజలకు వేళకు నాణ్యమైన వైద్యం అందిస్తూ ప్రభుత్వ వైద్య వ్యవస్థపై నమ్మకం పెంచేలా సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు.
తర్వాత అన్నపురెడ్డిపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు. యాంటీ రేబీస్ వారోత్సవం సందర్భంగా కుక్కకాటు పట్ల అప్రమత్తత, బాధితులకు తక్షణ ప్రథమ చికిత్స ప్రాధాన్యతను వివరించారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి సమతుల్య పోషకాహారం, నిత్యం చేతులు శుభ్రంగా కడుక్కోవడం లాంటి వ్యక్తిగత పరిశుభ్రత అలవాట్లు ఎంతో అవసరమని సూచించారు. ఆరోగ్యకరమైన విద్యార్థులే ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని పేర్కొన్న ఆయన, విద్యార్థులు ఈ ఆరోగ్య సూత్రాలను తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

