కలం, వెబ్ డెస్క్: ఐపీఎల్ (IPL)2026 సీజన్ ఆరంభంలోనే క్రికెట్ అభిమానులకు అసలైన మజా లభించింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఘనవిజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) నిర్దేశించిన 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్‌సీబీ కేవలం 15.4 ఓవర్లలోనే ఛేదించి, ప్రత్యర్థిని చిత్తు చేసింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆరంభంలోనే చుక్కెదురైంది. పవర్‌ప్లే ముగియకముందే ట్రావిస్ హెడ్ (11), అభిషేక్ శర్మ (7), నితీష్ కుమార్ రెడ్డి (1) వికెట్లను కోల్పోయి 29 పరుగులకే 3 వికెట్లు పడి కష్టాల్లో పడింది. అయితే, స్టాండ్-ఇన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో ఆర్‌సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కిషన్ కేవలం 38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 80 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. అతనికి తోడుగా హెన్రిచ్ క్లాసెన్ 31 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ చివరలో యువ సంచలనం అనికేత్ వర్మ కేవలం 18 బంతుల్లో 4 సిక్సర్లు, 3 ఫోర్లతో 43 పరుగులు చేసి స్కోరును 200 దాటించాడు. దీంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.
ఆర్‌సీబీ బౌలర్లలో అరంగేట్రం చేసిన కివీస్ బౌలర్ జాకబ్ డఫీ అద్భుత ప్రదర్శన చేశాడు. 4 ఓవర్లలో కేవలం 22 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. రొమారియో షేపర్డ్ కూడా 3 వికెట్లు తీసినప్పటికీ, 54 పరుగులు సమర్పించుకున్నాడు. భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, సుయాష్ శర్మ తలో వికెట్ సాధించారు.
202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీకి ఓపెనర్ ఫిల్ సాల్ట్ (8) త్వరగానే అవుట్ అయినా, ఆ తర్వాత విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ కలిసి పరుగుల వరద పారించారు. కోహ్లీ తన క్లాసిక్ ఫామ్‌ను కొనసాగిస్తూ 38 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు పడిక్కల్ కేవలం 26 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేసి స్టేడియాన్ని హోరెత్తించాడు.
వీరిద్దరి అవుట్ తర్వాత కెప్టెన్ రజత్ పాటిదార్ కేవలం 12 బంతుల్లో 3 సిక్సర్లతో 31 పరుగులు చేసి విజయానికి చేరువ చేయగా, చివర్లో టిమ్ డేవిడ్ (16 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఆర్‌సీబీ కేవలం 15.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 203 పరుగులు సాధించింది. హైదరాబాద్ బౌలర్లలో డేవిడ్ పేన్ 2 వికెట్లు తీయగా, ఉనద్కత్, హర్ష్ దూబే చెరో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో బెంగళూరు తమ హోమ్ గ్రౌండ్‌లో పట్టు నిరూపించుకోగా, భారీ స్కోరు చేసినా బౌలింగ్ వైఫల్యంతో హైదరాబాద్‌కు నిరాశ ఎదురైంది.

