కలం, తెలంగాణ బ్యూరో : బెంగాల్‌లో అధికారంలోకి వచ్చిన బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ (Telangana) అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) వ్యాఖ్యానించారు. బెంగాల్ ఫలితాలే తెలంగాణలోనూ రిపీట్ అవుతాయని, ఇక్కడ రాజకీయాల్లో ఇది కీలకమైన మలుపు అవుతుందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో 8 బీజేపీ గెలిచిందని, దాదాపు 50% ఓటర్లు మద్దతు పలికారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదని, ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారడంతో ఆల్టర్నేట్ బీజేపీ అని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలు బీజేపీ (BJP)వైపు చూస్తున్నారని, కేంద్రంలోని పాలన చూసిన తర్వాత రాష్ట్రంలోనూ అలాంటి పరిపాలనే కావాలని కోరుకుంటున్నారని అన్నారు. హైదరాబాద్‌కు వచ్చిన ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
లోకల్ లీడర్‌షిప్ లేక ‘స్థానికం’లో ఓడిపోయాం
పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ బూత్‌కు వెళ్లిన ప్రతి 100 మందిలో 36 మంది బీజేపీకి ఓటేశారు అని గుర్తుచేసిన కేంద్ర మంత్రి.. దాపు 36% ఓట్ షేర్ వచ్చిందన్నారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదని, ఇందుకు కారణం లోకల్‌గా పార్టీకి లీడర్‌షిప్ లేకపోవడమేనని వివరించారు. భవిష్యత్తులో ఆ లోటును అధిగమిస్తామని, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తామన్నారు. బీఆర్ఎస్ ఇప్పుడు థర్డ్ ప్లేస్‌కు పరిమతమైందన్నారు. ప్రజల దృష్టి ఇప్పుడు బీజేపీ వైపు మళ్లుతోందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే కాక రాహుల్ గాంధీ-కేసీఆర్ మధ్య కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయని ఆరోపించిన కిషన్‌రెడ్డి.. తెలంగాణలో కేసీఆర్ ఉంటేనే కొంత బెటర్ అని రాహుల్ భావిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్‌తో బీజేపీకి ఎప్పుడూ పొత్తు లేదని, భవిష్యత్తులో కూడా అలాంటి పరిస్థితి ఉండదన్నారు. తెలంగాణలో 2,400 కి.మీ. జాతీయ రహదారులను 5 వేల కిలోమీటర్లకు పైగా విస్తరించామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 42 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేశామని, ఆస్పత్రుల అభివృద్ధికి కూడా ప్రధాని నాయకత్వంలో చర్యలు తీసుకున్నామని వివరించారు.
రెండు పార్టీలూ తెలంగాణను అస్తవ్యస్థం చేశాయి
మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారంటూ రెండు పార్టీల పాలనను కిషన్‌రెడ్డి (Kishan Reddy) నిందించారు. అప్పుల కోసమే ప్రభుత్వాలు కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తున్నాయని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే నిర్ణయాలు తీసుకుంటున్నాయని ఆరోపించారు. మోదీ హయాంలో 12 ఏళ్లలో కేంద్రం తరపున తెలంగాణలో రూ. 13 లక్షల కోట్ల విలువైన పనులు జరిగాయని, పథకాలు అమలయ్యాయని అన్నారు. మోదీ పని రాక్షసుడని, ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం పనిచేస్తున్నారని అన్నారు. కొన్నిసార్లు విమానాల్లోనే స్నానం చేసి బట్టలు మార్చుకుంటారు అని పేర్కొన్నారు. దేశంలో బంగారం, ఇంధన కొరత లేదని, కానీ వృథా ఖర్చు తగ్గించాలని ప్రజలకు ప్రధాని సూచించారని గుర్తుచేశారు. ఇంధన ధరల పెరుగుదల వ్యక్తిగత నిర్ణయం కాదని, అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం అని అన్నారు. “పనీపాట లేకనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలపై కామెంట్లు చేస్తున్నారు” అని ఆరోపించారు.

