కలం, యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరి (Bhuvanagiri) ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మహాత్మ గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. వేడుకల్లో భాగంగా పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం జిల్లాలో తమ విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు అధికారులను, ఉద్యోగులను ప్రశంసా పత్రాలతో సత్కరించారు.
డీఆర్‌డీఏ, వివిధ సంస్థల సంయుక్త సహకారంతో ఏర్పాటు చేసిన మిల్లెట్ కేఫ్ వాహనాలు, వ్యవసాయ డ్రోన్ పరికరాలను లబ్ధిదారులకు అందజేశారు. అలాగే దివ్యాంగులకు బ్యాటరీ ఆధారిత త్రిచక్ర వాహనాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అక్షాంశ్ యాదవ్, అదనపు కలెక్టర్లు భాస్కర్ రావు, వెంకారెడ్డి, భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి-రవికుమార్, వైస్ చైర్‌పర్సన్ పోతంశెట్టి మంజుల-వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అవేస్ చిస్తి, ఆర్డీవో కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

