కలం, వెబ్ డెస్క్: తమ ప్రభుత్వం అందించే రేషన్ కార్డు.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం అని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల (Smart Ration Card) పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ పేద ప్రజలు ఆకలితో పస్తులు ఉండొద్దనే సంకల్పంతో కొత్త రేషన్ కార్డులిస్తున్నామని అన్నారు. నూతన స్మార్ట్ రేషన్ కార్డు ప్లాస్టిక్ వస్తువు, బియ్యం తెచ్చిపెట్టే సాధనం కాదు అని.. రాష్ట్ర ప్రజల ఆకలి తీర్చేదని తెలిపారు. రాష్ట్రంలో కోటి 6 లక్షల మందికి స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తున్నామని అన్నారు. దేశంలో రేషన్ కార్డుల వ్యవస్థను తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. కూడు, గూడు, గుడ్డ ఉండాలని ఆనాడు ఇందిరమ్మ చెప్పారని గుర్తు చేశారు.
బీజేపీ, బీఆర్ఎస్ బొమ్మాబొరుసు లాంటివి..
రాష్ట్రంలోని పేదలకు సంక్షేమ పథకాలు అందించటమే ప్రజా ప్రభుత్వ అని బాధ్యత అని మరోమారు సీఎం వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలపై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ వేర్వేరు కాదని.. బొమ్మాబొరుసు లాంటి వారని మండిపడ్డారు. సన్నబియ్యం ఇవ్వాలని గత పదేళ్లలో కలలోనైనా ఊహించారా? అని అడిగారు. రాష్ట్రంలోని 3 కోట్ల 48 లక్షల మందికి ప్రతి నెలా 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందజేస్తున్నామని సీఎం వివరించారు. తెలంగాణ సన్నబియ్యం ఇచ్చాకే మార్కెట్ లో ధరలు తగ్గాయని అన్నారు.
ఎక్కడైనా కరెంట్ పోయిందా?
కాంగ్రెస్ వస్తే కరెంట్ పోతుందన్నారు.. ఎక్కడైనా పోయిందా? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ఆనాటి సీఎం వరి వేస్తే ఉరి అని.. ఆయన ఫామ్ హౌస్ లో వరి వేశారని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ను ఉద్దేశించి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వరి వేసిన రైతులకు బోనస్ ఇచ్చి వడ్లు కొంటున్నామని చెప్పుకొచ్చారు. రైతు బంధు పథకాన్ని తాను బంద్ చేయలేదని.. ఇంకో రూ.2 వేలు పెంచి రైతు భరోసా ఇస్తున్నామని తెలిపారు.

