కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి వేదికగా జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల (Smart Ration Cards) పంపిణీ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఒక ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) పేర్కొన్నారు. ఈ సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రేషన్ కార్డుల పంపిణీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని చెప్పారు. గత BRS హయాంలో ప్రజలకు నాసిరకం దొడ్డు బియ్యం పంపిణీ చేసేవారని, అవి తినడానికి అనుకూలంగా లేకపోవడంతో పేదలు వాటిని కిలో 10 రూపాయలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతుల నుంచి సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తోందని, ఆ ధాన్యాన్ని మిల్లింగ్ చేయించి నిరుపేదలకు అత్యంత నాణ్యమైన సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తోందని వివరించారు. మన రాష్ట్రంలో ఇస్తున్న విధంగా ఉచితంగా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేయడం దేశంలో ఏ ఇతర రాష్ట్రంలోనూ లేదని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో 1.06 కోట్ల ఆహార భద్రతా కార్డుల ద్వారా దాదాపు 3.43 కోట్ల మందికి లబ్ధి చేకూరుతోందన్నారు. నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏటా 14,800 కోట్లు వెచ్చిస్తోందని తెలిపారు. రేషన్ కార్డులు ద్వారా రాష్ట్రంలో దాదాపు 85 శాతం జనాభాకు ఉచిత సన్న బియ్యం అందుతోందని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో సుమారు 89 లక్షల కార్డులు ఉండి, 2.81 కోట్ల మందికి పరిమితం కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా 16.32 లక్షల కార్డులు పెంచి మొత్తం లబ్ధిదారుల సంఖ్యను 3.06 కోట్లకు పైగా విస్తరించిందని వివరించారు.
రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం పారదర్శకంగా కొనసాగుతుందని మంత్రి తెలిపారు. రేషన్ కార్డుల మంజూరు, పంపిణీ అనేది ఒక నిరంతర ప్రక్రియ అని వెల్లడించారు. అర్హులైన పేదలందరికీ దరఖాస్తు చేసుకున్న వెంటనే కార్డులు మంజూరు చేస్తున్నామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు పదే పదే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్క నీరు తీసుకోకుండానే రాష్ట్ర రైతాంగం దేశంలోనే అత్యధిక ధాన్యం పండించిందని కొనియాడారు. వరి కొనుగోళ్ల ద్వారా ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో దాదాపు రూ.90,000 కోట్లు జమ చేసినట్లు మంత్రి వెల్లడించారు.

