బండి బగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలి: ప్రజా సంఘాలు

కలం, నిజామాబాద్ బ్యూరో: లైంగికదాడి కేసులో బండి భగీరథ్‌(Bandi Bhagirath)ను వెంటనే అరెస్ట్ చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. కుమారుడు చేసిన పనికి బండి సంజయ్ వెంటనే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కోరారు. శుక్రవారం POW, PYL, PDSU, TUCI సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు నాయకులకు తోపులాట జరిగింది.

కుమారుడిని కాపాడుతున్న బండి

ప్రభుత్వం పోలీసు వైఖరిపై ప్రజాసంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా POW, TUCI జిల్లా ప్రధాన కార్యదర్శులు కే సంధ్యారాణి, ఎం సుధాకర్ మాట్లాడుతూ బండి సంజయ్ తన పదవిని అడ్డుపెట్టుకొని కుమారుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. పైగా మైనర్ బాలికనే దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ కొడుకును శిక్ష నుంచి తప్పించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తం ఉందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. ఇదే వైఖరి కొనసాగితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఎందుకు అరెస్ట్ చేయడం లేదు

ఫోక్సో కేసు నమోదయి వారం రోజులు గడుస్తున్నా ఇప్పటికీ నేరస్థుడు అరెస్టు కాకపోవడం దుర్మార్గమన్నారు. సామాన్యులకు ఒక న్యాయం, నాయకులకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. బండి సంజయ్ మీడియాను, సోషల్ మీడియాను, పోలీసులను, చివరకు న్యాయవ్యవస్థను కూడా ప్రభావితం చేస్తున్నాడని ఆరోపించారు. వెంటనే బండి సంజయ్ రాజీనామా చేయాలని లేకుంటే, నరేంద్ర మోడీ అతన్ని భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాయి భగీరథను అరెస్టు చేసి, మహిళలకు భరోసా ఇవ్వాలన్నారు. లేనిచో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీయుసీఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం వెంకన్న, డీ రాజేశ్వర్, నాయకులు సాయరెడ్డి, గంగాధర్, విఠల్, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు సాయిబాబా, మహేష్ పీఓడబ్ల్యూ నాయకులు అమూల్య, మానస, పీడీఎస్‌యూ నాయకులు అషూర్ నసీర్ సృజన్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>