బక్రీద్ వేళ బీభత్సం వద్దు.. భద్రత ముద్దు: ఏసీపీ రమణమూర్తి

కలం, ఖమ్మం బ్యూరో: రానున్న బక్రీద్ పండుగను (Bakrid Celebrations) శాంతియుతంగా, మత సామరస్య వాతావరణంలో జరుపుకోవాలని ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి పిలుపునిచ్చారు. పండుగ రోజుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతిభద్రతలు పరిరక్షించేలా అందరూ సహకరించాలని కోరారు. బక్రీద్ పండుగ ఏర్పాట్లపై ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌ లో ముస్లిం మత పెద్దలు, మసీదు కమిటీ సభ్యులతో బుధవారం ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. అలాగే పశువుల రవాణాకు సంబంధించిన నిబంధనలు, చట్టపరమైన అంశాలపై వీహెచ్ పి, హిందూ వాహిని, బజరంగ్ దళ్, గో రక్షణ కమిటీ ప్రతినిధులతో ఏసీపీ వేరొక సమావేశాన్ని ఏర్పాటు చేసి సుదీర్ఘంగా చర్చించారు.

గోవధ చట్టరీత్యా నేరం..

​ఈ సందర్భంగా ఏసీపీ రమణమూర్తి మాట్లాడుతూ.. గోవధ చట్టరీత్యా నేరమని, కేవలం అనుమతించబడిన జంతువులను మాత్రమే నిబంధనలకు లోబడి బలి ఇవ్వాలని స్పష్టం చేశారు. పశువుల రవాణా దారులు తప్పనిసరిగా పశు వైద్యుల నుండి చెల్లుబాటు అయ్యే ధృవ పత్రాలు, అధికారిక రవాణా రసీదులను కలిగి ఉండాలన్నారు. అక్రమ పశువుల రవాణాను అరికట్టడానికి జిల్లా సరిహద్దుల్లో ఇప్పటికే ఏడు చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశామని, ఇక్కడ మూడు షిఫ్టులలో అధికారులు 24 గంటల పాటు నిఘా ఉంచుతారని తెలిపారు. తనిఖీల్లో పట్టుబడిన పశువులను దగ్గరలోని గోశాలలకు తరలిస్తామని చెప్పారు. అదేవిధంగా పండుగ సమయంలో జంతు వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా, మున్సిపల్ అధికారుల సహకారంతో వాటిని వెంటనే తొలగించి పరిశుభ్రత పాటించాలని ముస్లిం పెద్దలకు సూచించారు.

వ్యక్తిగత దాడులు తీవ్రమైన నేరం..

​మరోవైపు, ఆవులు, దూడల అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, వ్యక్తిగత దాడులకు పాల్పడడం తీవ్రమైన నేరమని ఏసీపీ హెచ్చరించారు. గో రక్షకుల పేరుతో వాహనాలను ధ్వంసం చేయడం, దాడులు చేయడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎక్కడైనా పశువుల అక్రమ రవాణాను గమనిస్తే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా, వెంటనే 8712659111 నంబర్‌కు గానీ, స్థానిక పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం అందించి సహకరించాలని కోరారు.

అలాంటి వారిపై కఠిన చర్యలు..

సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వార్తలు, వదంతులు వ్యాప్తి చేసేవారిపై నిఘా ఉంచామని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం గట్టి పోలీస్ బందోబస్తును పటిష్టం చేస్తున్నట్లు ఏసీపీ వివరించారు. ​ఈ సమన్వయ సమావేశాలలో వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్లు కరుణాకర్, మోహన్ బాబు, బాలకృష్ణలతో పాటు పలువురు సబ్ ఇన్‌స్పెక్టర్లు, ముస్లిం మత పెద్దలు, వివిధ హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

 Read Also: టామ్‌కామ్‌ బలోపేతానికి ప్రత్యేక చర్యలు: మంత్రి వివేక్

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>