కలం, కరీంనగర్ బ్యూరో: పదవి గద్దెపై కూర్చొని పాలన చేయడం కాదు.. పల్లె గడప తొక్కి ప్రజల గుండె చప్పుడు వినడమే అసలైన ప్రజాపాలన అని చాటిచెబుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) హుస్నాబాద్ నియోజకవర్గంలో చేపట్టిన “పల్లె పల్లెకు పొన్నం అన్న – పల్లె పల్లెల్లో ప్రజా పాలన” కార్యక్రమం రాష్ట్రంలో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ తనను ఎన్నుకున్న ప్రజల వద్దకే స్వయంగా వెళ్లి, ఒక్కో పల్లెను పలకరిస్తూ, సమస్యల గుండెచప్పుడు వింటూ, అధికార యంత్రాంగాన్ని ప్రజల ముందుకు తీసుకువచ్చి, సాధ్యమైన సమస్యలకు అక్కడికక్కడే పరిష్కార బాట వేయడం.. మిగిలిన సమస్యలకు గడువు నిర్దేశించి వాటి పరిష్కారం వరకు వెన్నంటి నిలవడం ఇప్పటివరకు కనిపించిన సంప్రదాయ రాజకీయ పర్యటనలకు పూర్తిగా భిన్నమైన ప్రజా సేవా ప్రయోగం.
ఏ మంత్రి చేపట్టని రీతిలో..
173 గ్రామాల గడపలను తట్టే ఈ పల్లెబాట కేవలం మంత్రి పర్యటన కాదు.. ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లే పరిపాలనా విప్లవం. ప్రజల మాటను ప్రభుత్వ నిర్ణయంగా మలిచే ప్రజాస్వామ్య ప్రక్రియ.. ప్రజాప్రతినిధి బాధ్యతకు కొత్త నిర్వచనం. తెలంగాణలో ఇప్పటివరకు ఏ మంత్రి చేపట్టని రీతిలో తన నియోజకవర్గాన్ని గ్రామం గ్రామంగా చుట్టి ప్రజల మధ్యే పాలనకు శ్రీకారం చుట్టిన పొన్నం ప్రభాకర్ అడుగు.. ఆదర్శనీయం, ఆచరణీయం, చారిత్రాత్మకం. ముఖ్యంగా ప్రజా సమస్యే తన కార్యసూచిగా, ప్రజల పరిష్కారమే తన లక్ష్యంగా సాగుతున్న ఈ వినూత్న పల్లె ప్రయాణం రేపటి ప్రజాపాలనకు మార్గదర్శకంగా నిలిచే విప్లవాత్మక ప్రయత్నంగా నిలుస్తోంది. బుధవారం సైదాపూర్ మండలంలో ఈ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.
తొలి రోజు ఆరు గ్రామాల్లో కార్యక్రమం విజయవంతంగా సాగింది. దుద్దేనేపల్లి, ఎక్లాస్ పూర్, సోమారం, గర్రెపల్లి, లస్మన్నపల్లి, వెన్నెంపల్లి, ఆరేపల్లి గ్రామాల్లో పర్యటించి అక్కడికక్కడే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి ఐదేళ్లకు ఒకసారి ఓటు కోసం ప్రజల ముందుకు రావడం కాదు. ప్రజల కష్టాలు, కన్నీళ్లు, అవసరాలు తెలుసుకునేందుకు నిరంతరం వారి మధ్యే ఉండాలి.
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చొని ఫైళ్లపై సంతకాలు చేయడం కాదు.. ప్రజల గడప వద్దకు వెళ్లి వారి సమస్యలను స్వయంగా వినడం.. పరిష్కార మార్గాలను అక్కడికక్కడే చూపించడం. ఈ భావనకు ఆచరణ రూపం ఇస్తూ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గంలో చేపట్టిన “పల్లె పల్లెకు పొన్నం అన్న – పల్లె పల్లెల్లో ప్రజా పాలన” కార్యక్రమం ఆదర్శంగా నిలుస్తుంది.
తెలంగాణ రాజకీయ, పరిపాలనా చరిత్రలో ఒక రాష్ట్ర మంత్రి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని స్వయంగా సందర్శిస్తూ.. ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తూ.. వారి సమస్యలను నమోదు చేసి.. సంబంధిత అధికారులను అదే వేదికపైకి తీసుకువచ్చి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించడం అరుదైన ప్రయోగంగా నిలుస్తోంది. అందుకే ఈ కార్యక్రమం సాధారణ పర్యటన కాదు.. ప్రజాప్రతినిధి తన బాధ్యతను ప్రజల మధ్య నిర్వర్తిస్తున్న ప్రజాస్వామ్య ప్రయోగం.
పల్లె బాట పట్టిన మంత్రి
హుస్నాబాద్ నియోజకవర్గంలోని 173 గ్రామాలను లక్ష్యంగా చేసుకుని ప్రారంభించిన ఈ కార్యక్రమానికి తొలిరోజు సైదాపూర్ మండలం వేదికైంది. ఉదయం దుద్దెనపల్లి నుంచి ప్రారంభమైన మంత్రి పర్యటన.. ఎక్లాస్పూర్, సోమారం, వెన్నంపల్లి, ఆరెపల్లి గ్రామాల వరకు కొనసాగింది. ప్రతి గ్రామంలో ప్రజలు, రైతులు, మహిళా సంఘాల ప్రతినిధులతో మంత్రి నేరుగా మాట్లాడారు. గ్రామంలో ఏ సమస్య ఉంది? ఏ పని పెండింగ్‌లో ఉంది? ఎవరికి సంక్షేమ పథకం అందలేదు? రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమిటి? తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, విద్య, వైద్యం, సాగునీటి పరిస్థితి ఎలా ఉంది? వంటి అంశాలను క్షేత్రస్థాయిలో తెలుసుకున్నారు.
ఇది కేవలం వినతిపత్రాలు స్వీకరించే కార్యక్రమంగా కాకుండా.. సమస్యను వినడం – నమోదు చేయడం – సంబంధిత అధికారిని గుర్తించడం – పరిష్కారానికి గడువు నిర్ణయించడం – తిరిగి సమీక్షించడం అనే విధానంతో ముందుకు సాగడం ఈ కార్యక్రమానికి ప్రత్యేకత.
ప్రజల మధ్యే పాలన.. ఇదే అసలైన ప్రజాపాలన
“ప్రజాపాలన అంటే కార్యాలయాల్లో కూర్చొని పాలన చేయడం కాదు.. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడమే ప్రజాపాలన” అన్న మంత్రి పొన్నం ప్రభాకర్ మాటలు ఈ కార్యక్రమం ఉద్దేశాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. ప్రతి గ్రామంలో ప్రధానంగా ఐదు కీలక సమస్యలను గుర్తించి వాటికి సంబంధిత శాఖ, అధికారి, నిధులు, చేపట్టాల్సిన చర్య, పూర్తి చేయాల్సిన గడువును నిర్ణయించే విధానం తీసుకురావడం ద్వారా సమస్యల పరిష్కారాన్ని బాధ్యతాయుతంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. కార్యక్రమం ముగిసిన తర్వాత సమస్యలను వదిలేయకుండా.. 24 గంటల్లో నివేదిక, 7, 15, 30 రోజుల వ్యవధిలో సమీక్షలు నిర్వహించేలా పర్యవేక్షణ వ్యవస్థను రూపొందించడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
దుద్దెనపల్లిలో అభివృద్ధికి అద్దం
దుద్దెనపల్లిలో రూ.20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానను మంత్రి ప్రారంభించారు. అనంతరం రైతు వేదికలో ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రైతు బీమా, రుణమాఫీ, సన్న వడ్లకు బోనస్, రేషన్ కార్డులు, భూ భారతి, కళ్యాణ లక్ష్మి, స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సహాయం వంటి పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలును వివరించారు. అదేవిధంగా దుద్దెనపల్లి–మొగిలిపల్లి బ్రిడ్జి నిర్మాణానికి రూ.3.56 కోట్లు మంజూరు కావడం, గ్రామ పంచాయతీ భవనం, జిమ్, గ్రామ సమైక్య భవనం వంటి మౌలిక వసతులపై మంత్రి వెల్లడించిన వివరాలు గ్రామాభివృద్ధి దిశను చూపుతున్నాయి.
ఎక్లాస్పూర్లోనూ అదే స్పూర్తి
ఎక్లాస్‌పూర్‌లో రూ.20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానను ప్రారంభించిన మంత్రి.. అనంతరం గ్రామ ప్రజలతో నేరుగా మాట్లాడారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 గ్యాస్ సబ్సిడీ, రైతు భరోసా, రైతు బీమా, రుణమాఫీ, రేషన్ కార్డులు, పింఛన్లు, స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సహాయం వంటి పథకాల లబ్ధిని వివరించారు. అర్హత ఉన్నా సంక్షేమ పథకాలు అందని వారిని గుర్తించి వారికి ప్రయోజనం అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
సోమారం, గర్రెపల్లిలో జరిగిన కార్యక్రమాల్లో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజా సమస్యలు నేరుగా వినడానికి అధికారులతో ముఖాముఖి నిర్వహించారు. ఈనెల 31 వరకు 7 రకాల పింఛన్ల అప్లికేషన్లు జరుగుతున్నాయని ,సంక్షేమ పథకాలు అందుతున్న వివరాలు ఆరా తీశారు. లస్మన్నపల్లిలో ప్రజా పాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. ప్రభుత్వ పథకాలు అందని వారి వివరాలు అధికారులు నమోదు చేసుకున్నారు. గ్రామ సమస్యలు పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టారు.
వెన్నెంపల్లిలో 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖాన ప్రారంభించారు. గ్రామంలో మంజూరు అయిన 21 ఇందిరమ్మ ఇళ్లు వేగంగా పూర్తయ్యాయని రెండవ విడత త్వరలోనే మంజూరు చేస్తామని తెలిపారు.35 మహిళా సంఘాలకు 13.5 లక్షల వడ్డీలేని రుణాలు,బ్యాంక్ లింకేజ్ కింద 4.35 కోట్లు విడుదల అయ్యాయి.గ్రామంలో 7.13 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ జరగగా ,213 మంది రైతులకు సన్న వడ్ల బోనస్ విడుదల అయిందని తెలిపారు.
ఆరేపల్లిలో అభివృద్ధి బాట
ఆరేపల్లిలో పల్లె పల్లెకు పొన్నం అన్న పల్లె పల్లెలో ప్రజా పాలన” కార్యక్రమంలో భాగంగా 10 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ మహిళా సంఘం భవనాన్ని, ప్రాథమిక పాఠశాలలో కిచెన్ షెడ్ ప్రారంభించారు.ప్రజా సమస్యలపై అప్పటికప్పుడు పరిష్కరించారు.
రైతు బాట.. ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు
వర్షాభావ పరిస్థితుల్లో నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి పిలుపునిచ్చారు. జలసిరి కార్యక్రమం ద్వారా ఇంకుడు గుంతలు, బోర్వెల్ ఇంజెక్షన్ పాయింట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వరి సాగుపై మాత్రమే ఆధారపడకుండా ఆరుతడి పంటలు, ఆయిల్‌పామ్ వంటి ప్రత్యామ్నాయ, లాభదాయక పంటల వైపు రైతులు అడుగులు వేయాలని సూచించడం ద్వారా వ్యవసాయ రంగంలోనూ కొత్త ఆలోచనకు ప్రాధాన్యత ఇచ్చారు. 200 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగును పూర్తి చేసిన గ్రామ పంచాయతీలకు రూ.5 లక్షల అభివృద్ధి నిధులు అందిస్తామని ప్రకటించడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా మరో అడుగు.
సంక్షేమం.. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి..
వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్, హెచ్ఐవీ, బోదకాలు, తలసేమియా తదితర వర్గాలకు చెందిన అర్హులకు పింఛన్లు అందేలా దరఖాస్తులు స్వీకరిస్తున్నామని మంత్రి తెలిపారు.“అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలి” అనే లక్ష్యంతో గ్రామస్థాయిలోనే సమస్యలను గుర్తించడం ఈ కార్యక్రమానికి మరో ముఖ్యమైన బలం.
ప్రజల ముందుకు అధికార యంత్రాంగం..
ఒక గ్రామంలో సమస్య ఉందంటే దాని పరిష్కారం కోసం ప్రజలు మండల కార్యాలయం, జిల్లా కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. అధికార యంత్రాంగాన్ని గ్రామానికే తీసుకురావడం ఈ కార్యక్రమంలోని వినూత్న అంశం. తాగునీటి నుంచి డ్రైనేజీ వరకు.. రోడ్ల నుంచి విద్యుత్ వరకు.. పాఠశాలల నుంచి ఆరోగ్య కేంద్రాల వరకు.. చెరువుల నుంచి సాగునీటి ప్రాజెక్టుల వరకు ప్రతి అంశాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించే విధానం ప్రజాపాలనకు కొత్త అర్థాన్ని ఇస్తోంది.
దీర్ఘకాలిక సమస్యలకు రాష్ట్రస్థాయిలో పరిష్కారం..
గౌరవెల్లి ప్రాజెక్టు, సాగునీటి కాలువలకు భూసేకరణ, ఎల్ఎండీ నుంచి వచ్చే నీటి ప్రాజెక్టు, ఎంఎంఆర్ కింద పెండింగ్‌లో ఉన్న పనులు వంటి దీర్ఘకాలిక అంశాలను రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి, కేబినెట్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని మంత్రి ప్రకటించారు. అంటే గ్రామ సమస్యను గ్రామస్థాయిలోనే ఆపకుండా.. అవసరమైతే మండలం, జిల్లా, రాష్ట్రస్థాయికి తీసుకెళ్లి పరిష్కరించే బహుస్థాయి విధానం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం
ప్రజాప్రతినిధికి ప్రజలే బలం
ఒక ప్రజాప్రతినిధి తన నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని సందర్శించడం ఒక సాధారణ రాజకీయ కార్యక్రమం కావచ్చు. కానీ ప్రతి గ్రామంలో ప్రజలతో కూర్చొని వారి సమస్యలు వినడం.. అధికారులను సమన్వయం చేయడం.. పరిష్కారానికి గడువు పెట్టడం.. తిరిగి ఆ సమస్య పరిష్కారమైందా లేదా అని పర్యవేక్షించడం మాత్రం భిన్నమైన ప్రజా సేవా విధానం. అందుకే “పల్లె పల్లెకు పొన్నం అన్న” కార్యక్రమాన్ని కేవలం రాజకీయ పర్యటనగా కాకుండా.. ప్రజా ప్రతినిధిత్వానికి కొత్త నమూనాగా చూడాల్సిన అవసరం ఉంది.
173 గ్రామాలు.. ఒకే లక్ష్యం
హుస్నాబాద్ నియోజకవర్గంలోని 173 గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవాలనే లక్ష్యంతో మంత్రి పొన్నం ప్రభాకర్ చేపట్టిన ఈ కార్యక్రమం ముందుకు సాగనుంది. ప్రజల మధ్య ఉండే నాయకత్వం.. ప్రజల సమస్యలను వినే పాలన.. పరిష్కారానికి కట్టుబడి ఉండే అధికార యంత్రాంగం.. నిరంతర పర్యవేక్షణ.. ఈ నాలుగు అంశాలు కలిస్తేనే ప్రజాపాలనకు నిజమైన అర్థం వస్తుంది. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి.. ప్రజల మధ్యే ఉండి.. ప్రజల సమస్యలే తన కార్యాచరణగా మార్చుకుంటే ప్రజాస్వామ్యానికి అసలైన అర్థం వస్తుంది. ఆ దిశగా హుస్నాబాద్‌లో ప్రారంభమైన ఈ వినూత్న కార్యక్రమం తెలంగాణలో ప్రజాపాలనకు ఒక ఆదర్శ నమూనాగా నిలుస్తుంది. పాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లే ఆలోచనకు పల్లె బాట పట్టిన పొన్నం ప్రభాకర్ కార్యక్రమం కొత్త నిర్వచనం ఇస్తోంది.

