కలం, ఖమ్మం బ్యూరో: నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేసి, విపరీతమైన శబ్ద కాలుష్యం సృష్టించే బుల్లెట్ బైక్‌ల సైలెన్సర్లపై పోలీసులు (Khammam Police ) ఉక్కుపాదం మోపారు. నగరవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పట్టుకున్న దాదాపు 1,650 మోడిఫైడ్ సైలెన్సర్లను పోలీస్ హెడ్ క్వాటర్స్‌లో రోడ్డుపై పరిచి, రోడ్డు రోలర్‌తో తొక్కించి పూర్తిగా ధ్వంసం చేశారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు పర్యవేక్షణలో శుక్రవారం ఈ కఠిన చర్యలు చేపట్టినట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు.
కొంతమంది యువకులు, ఆకతాయిలు బైక్‌లపై స్టైల్ కోసం కంపెనీ సైలెన్సర్లను తొలగించి, విపరీతమైన శబ్దం వచ్చేలా మార్పులు చేస్తున్నారని ఇన్స్పెక్టర్ మండిపడ్డారు. ఇంకొందరైతే సైలెన్సర్లకు రంధ్రాలు చేసి మరీ ‘ఢాం.. ఢాం..’ అంటూ పేలుడు లాంటి శబ్దాలు సృష్టిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కర్ణకఠోర శబ్దాల వల్ల రహదారులపై వెళ్లే సాధారణ ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, గుండె జబ్బులు ఉన్నవారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని, గుండె ఆగినంత పనవుతోందంటూ ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు రావడంతోనే ఈ చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారు.
వాహనాలకు అధిక మొత్తంలో శబ్దం వచ్చే సైలెన్సర్లు వాడే వారిపై ఇకపైనా కఠిన చర్యలు ఉంటాయని ఇన్స్పెక్టర్ హెచ్చరించారు. బైక్‌లను ఇష్టానుసారంగా మోడిఫై చేయించే పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని, వారికి సరైన కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచించారు. సైలెన్సర్ల ధ్వంసంతోనే ఆగమని, రాబోయే రోజుల్లో నగరంలో విపరీతమైన శబ్దం చేసే హారన్లపై కూడా ప్రత్యేక దృష్టి సారించి, అలాంటి వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

