‘ఇన్‌స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డ్’ అందుకున్న తెలంగాణ డీజీపీ

కలం, క్రైమ్ బ్యూరో : తెలంగాణ పోలీస్ శాఖకు (Telangana Police) జాతీయస్థాయి గుర్తింపు లభించింది. పాస్‌పోర్ట్ ధృవీకరణ ప్రక్రియలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందిస్తున్నందుకు తెలంగాణ పోలీస్ శాఖకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతిష్ఠాత్మక “ఇన్‌స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డ్ ఫర్ స్టేట్ పోలీస్”ను ప్రదానం చేసింది. ఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్‌లో నిర్వహించిన పాస్‌పోర్ట్ సేవా దివస్ వేడుకల సందర్భంగా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ చేతుల మీదుగా శుక్రవారం తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

ఈ సందర్భంగా డీజీపీ సి.వి. ఆనంద్ (DGP CV Anand) మాట్లాడుతూ, పాస్‌పోర్ట్ జారీ ప్రక్రియలో పోలీస్ ధృవీకరణ అత్యంత కీలకమైన అంశమన్నారు. ప్రజలకు నాణ్యమైన, వేగవంతమైన సేవలు అందించడంలో తెలంగాణ పోలీసులు చూపుతున్న నిబద్ధతకు “ఇన్‌స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డ్ ఫర్ స్టేట్ పోలీస్” అవార్డు లభించడం గర్వకారణమని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించడం, క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయడం, ప్రజా సేవలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఈ ఘనత సాధ్యమైందని తెలిపారు.

2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో అందిన 8,67,741 పాస్‌పోర్ట్ దరఖాస్తుల్లో ఇప్పటికే 8,67,452 (99%) దరఖాస్తుల ధృవీకరణను తెలంగాణ పోలీసులు పూర్తి చేశారు. అంతకుముందు 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 8,06,684 పాస్‌పోర్ట్ దరఖాస్తులను 7 రోజుల లోపే ధృవీకరించి దేశవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరును ప్రదర్శించారు.

ఏడు జాతీయస్థాయి అవార్డులు..

సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా 2013-16 మధ్య కాలంలో పనిచేసిన ప్రస్తుత డీజీపీ సి.వి. ఆనంద్ 2014లో పాస్‌పోర్ట్ ధృవీకరణ కోసం ప్రత్యేకంగా ‘వెరిఫాస్ట్’ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు. 2015లో ఈ వ్యవస్థను రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తీసుకువచ్చారు. అప్పటి నుంచి పాస్‌పోర్ట్ ధృవీకరణ సేవల్లో అత్యుత్తమ పనితీరు కనబరుస్తూ తెలంగాణ పోలీసులకు (Telangana Police) ఇప్పటివరకు ఏడు జాతీయ స్థాయి అవార్డులు లభించాయి. పాస్‌పోర్ట్ ధృవీకరణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు తెలంగాణ పోలీసులు అభివృద్ధి చేసిన ‘వెరిఫాస్ట్’ వ్యవస్థ కృత్రిమ మేధస్సు, డేటా మ్యాచింగ్ సాంకేతికతల ఆధారంగా పనిచేస్తోంది.

ఈ వ్యవస్థ ద్వారా దరఖాస్తుదారుల వివరాలను సీసీటీఎన్‌ఎస్ , పూర్వపు పాస్‌పోర్ట్ రికార్డులు, ఇతర డేటాబేస్‌లతో సరిపోల్చి అనుమానాస్పద వివరాలు, నకిలీ దరఖాస్తులు, నేర చరిత్ర ఉన్న వ్యక్తులను త్వరితగతిన గుర్తించే అవకాశం కలుగుతోంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వేదికలపై అందుబాటులో ఉన్న ఈ వ్యవస్థ పోలీసు అధికారులకు ధృవీకరణ ప్రక్రియలో తోడ్పాటు అందించడమే కాకుండా, దరఖాస్తుదారులకు కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తోంది. భవిష్యత్తులో పౌరులు తమకు అనుకూలమైన సమయాన్ని ఎంచుకుని ధృవీకరణ అపాయింట్‌మెంట్‌ను షెడ్యూల్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

Read Also: తండ్రి కల కోసం రూ.30 కోట్ల ఆస్పత్రి.. ప్రవీణ్ లక్ష్యం 2028

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>