కలం, వెబ్ డెస్క్: ఢిల్లీలో ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) చేపట్టిన ప్రధాని ఇంటికి పాదయాత్ర కార్యక్రమంలో హైడ్రామా చోటు చేసుకుంది. ఆయన్ను పోలీసులు మధ్యలోనే అడ్డుకోవడంతో పార్టీ నేతలతో కలిసి రోడ్డుపైనే బైఠాయించి ధర్నాకు దిగారు. ఈ 20 పెట్రోల్ ఉపసంహరించుకోవాలని, లీటర్ పెట్రోల్ ధరను రూ.85 తగ్గించాలనే డిమాండ్లతో కేజ్రీవాల్ ఈ నిరసన చేపట్టారు.
కేజ్రీవాల్ మాట్లాడుతూ “ప్రధాని మోదీ ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయారు. అమెరికా నుంచి ఇథనాల్, ఈ20 పెట్రోల్ కొనుగోళ్లు వెంటనే నిలిపేయాలి. మమ్మల్ని ప్రధాని చర్చలకు పిలుస్తారని ఆశిస్తున్నాం. తాము కలవాలనుకుంటున్నట్లు ఇప్పటికే సమాచారం కూడా అందించాం. అప్పటివరకు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉంటాం” అని స్పష్టం చేశారు.
ఈ20 పెట్రోల్ వద్దంటున్నారు..
ఆప్ ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. ఈ20 పెట్రోల్ వద్దని లక్షల మంది ప్రజలు తమకు పిటిషన్లు సమర్పించామని.. అవి ప్రధాని మోదీకి అందజేయాలని భావిస్తున్నట్లు వివరించారు. ఇథనాల్ మీద ఆయనతో చర్చించాలని భావిస్తున్నట్లు వివరించారు. అమెరికాతో ఒప్పందంలో ఇథనాల్ దిగుమతులు చేర్చడం వలన దేశ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. అలాగే, వాహనదారులు తీవ్రంగా నష్టపోతున్నారని స్పష్టం చేశారు.

