Mobile Popup Ad
Mobile Popup Ad

తండ్రి కల కోసం రూ.30 కోట్ల ఆస్పత్రి.. ప్రవీణ్ లక్ష్యం 2028

కలం, స్పోర్ట్స్ : పారాలింపిక్ స్వర్ణ పతకంతో దేశానికి గర్వకారణంగా నిలిచిన ప్రవీణ్ కుమార్ (Praveen Kumar) ఇప్పుడు మరో పెద్ద లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. ఈసారి గురి పతకం కాదు.. తన తండ్రి ఎన్నాళ్లుగానో కలగన్న ఆస్పత్రి నిర్మాణం. 2028 నాటికి ఆ కలను నిజం చేయాలని అతడు సంకల్పించాడు. ప్రవీణ్ విజయాల వెనుక కుటుంబం చేసిన త్యాగాలు ఎంతో ఉన్నాయని తాజాగా వెల్లడించాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా తన క్రీడా ప్రయాణానికి తల్లిదండ్రులు ఎప్పుడూ అడ్డుగా నిలవలేదని తెలిపాడు. అవసరమైన డబ్బు కోసం అప్పులు చేసినా, ఆ విషయం తనకు తెలియనివ్వకుండా చూసుకున్నారని చెప్పాడు.

2019లో స్విట్జర్లాండ్‌లో జరిగిన జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం గెలిచిన తర్వాతే ఇంటి పరిస్థితి తనకు పూర్తిగా అర్థమైందని వివరించాడు. ఆ టోర్నీలో వచ్చిన రూ.5 లక్షల నగదు బహుమతిని తండ్రికి ఇచ్చి అప్పు భారాన్ని తగ్గించానని తెలిపాడు. ఆ తర్వాత 2021 టోక్యో పారాలింపిక్స్‌లో రజత పతకం సాధించిన సందర్భంగా తండ్రితో జరిగిన సంభాషణ తన జీవితాన్ని మార్చేసిందని వెల్లడించాడు. ఆ సమయంలో తండ్రి తన చిరకాల కోరికను చెప్పారని పేర్కొన్నాడు.

ఒక ఆస్పత్రి నిర్మించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా అది సాధ్యపడలేదని తండ్రి చెప్పినట్లు గుర్తు చేసుకున్నాడు. ఆ మాటలు విన్న వెంటనే ఆ కలను తానే నెరవేర్చాలని నిర్ణయించుకున్నట్లు ప్రవీణ్ తెలిపాడు. మాటలకే పరిమితం కాకుండా పనులు కూడా ప్రారంభించినట్లు వెల్లడించాడు. జేవర్‌లో, రాబోయే విమానాశ్రయం సమీపంలో ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియ ముందుకు సాగుతోందని చెప్పాడు. అవసరమైన పత్రాల పనులు పూర్తయ్యాయని, నిర్మాణం తదుపరి దశలోకి వెళ్తోందని వివరించాడు.

ఈ ప్రాజెక్టుకు రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని అంచనా వేశాడు. ప్రజలకు అవసరమైన అన్ని వైద్య సేవలు ఒకేచోట అందేలా ఆస్పత్రిని రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. తండ్రి నెరవేర్చలేకపోయిన కలను సాకారం చేయడమే తనకు పెద్ద విజయమని చెప్పాడు. ఒకవైపు లాస్ ఏంజెల్స్ 2028 పారాలింపిక్స్‌కు సిద్ధమవుతున్న ప్రవీణ్.. మరోవైపు తండ్రి కలను నిజం చేసేందుకు అడుగులు వేస్తున్నాడు. క్రీడల్లోనే కాదు, జీవిత లక్ష్యాల్లోనూ అతడు పెద్ద గురినే ఎంచుకున్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>