కలం, తెలంగాణ బ్యూరో: మార్కెట్లో నకిలీ ఎరువుల అమ్మకాలు జరుగుతున్నాయని, తక్కువ ధరకు అమ్ముతూ రైతుల్ని మోసం చేస్తున్నారని, ఒరిజినల్ ఎరువుల్ని బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఒకవైపు ఆకస్మిక తనిఖీలు చేస్తూనే మరోవైపు రైతుల్ని అలర్ట్ చేస్తున్నది. కొన్ని ఫిర్యాదులు కేంద్ర ప్రభుత్వం వినియోగిస్తున్న ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌కు (సీపీగ్రామ్స్) వెళ్తుండగా.. మరికొన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖకు వస్తున్నాయి. ఎక్కువ ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన రాష్ట్రంగా సౌత్ ఇండియాలో తెలంగాణ సెకండ్ ప్లేస్‌లో ఉన్నది. దుకాణాల లైసెన్సులు రద్దు చేయడంలో మాత్రం రాష్ట్రం ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నది.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇలాంటి తనిఖీలు, లైసెన్సుల రద్దు జరుగుతున్నది. తెలంగాణలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జులై చివరి వారం వరకు దాదాపు నాలుగు నెలల్లో రాష్ట్రంలోని ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు చేసి బ్లాక్ మార్కెట్లో విక్రయాలు, పరిమితికి మించి నిల్వ చేయడం, తక్కువ నాణ్యతతో కూడిన ఎరువుల విక్రయం, రైతులకు సబ్సిడీ మీద చెల్లించాల్సిన సరుకును దారిమళ్లించడం.. తదితర ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు.
4 నెలల్లోనే ఇలా..!
– రాష్ట్రవ్యాప్తంగా నాలుగు నెలల్లో ఎరువుల దుకాణాలపై వ్యవసాయ శాఖ 11,658 దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఇందులో 31 దుకాణాలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారు వివరణలు ఇచ్చిన తర్వాత 13 దుకాణాల లైసెన్సులను రద్దు చేసింది. ఏడు ఎఫ్ఐఆర్లను నమోదు చేసింది.
– వీటిలోనే ఎక్కువ ధరలకు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు తేలడంతో 28 దుకాణాలకు వ్యవసాయ శాఖ షోకాజ్ నోటీసులు ఇచ్చి.. చివరకు తొమ్మిది దుకాణాల లైసెన్సులను రద్దు చేసింది. ఆరు ఎఫ్ఐఆర్లను నమోదు చేసింది.
– అదేవిధంగా రైతులకు సబ్సిడీ కింద ఇవ్వాల్సిన ఎరువులను పక్కదారి పట్టిస్తున్నట్లు అనుమానించిన అధికారులు మూడు దుకాణాలకు షోకాజ్ నోటీసులు ఇచ్చి ఒకదాని లైసెన్సును రద్దు చేశారు.
– తమిళనాడులో 477 షోకాజ్ నోటీసులు ఇచ్చినా ఒక్క దుకాణం లైసెన్సునూ రద్దు చేయలేదు. కానీ 8 ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. ఆ తర్వాతి స్థానం తెలంగాణదే. రాష్ట్రంలో ఏడు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో కేవలం నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదు కాగా.. కర్నాటకలో ఆరు నమోదయ్యాయి. కేరళలో ఒక్కటి కూడా నమోదు కాలేదు.
నిత్యావసర వస్తువుల చట్టం కింద కేసులు
ఎరువులను ‘నిత్యావసర వస్తువుల’ (ఎస్సెన్షియల్ కమోడిటీస్) చట్టం పరిధిలో చేర్చడంతో నిబంధనలను ఉల్లంఘించిన దుకాణాలపైన కేసులూ ఆ చట్టంలోని సెక్షన్ల కిందనే నమోదవుతున్నాయి. రైతులకు సబ్సిడీ కింద కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్నా దుకాణాలు వాటిని నిజమైన రైతులకు ఇవ్వకుండా పక్కదారి పట్టిస్తున్నారని, కొన్ని సందర్భాల్లో రైతులకు తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్ర ఎరువుల మంత్రిత్వశాఖ పేర్కొన్నది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా గతేడాది 4.85 లక్షల తనిఖీల్లో 17,392 దుకాణాలకు షోకాస్ నోటీసులు జారీ అయ్యాయి. వివరణలు వచ్చిన తర్వాత మొత్తం 6,941 దుకాణాల లైసెన్సులను రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేశాయి. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలడంతో 847 దుకాణాల యజమానులు, నిర్వాహకులపై ఎఫ్ఆర్లు నమోదయ్యాయి. కానీ గతేడాదితో పోలిస్తే ఈసారి ఆకస్మిక తనిఖీలు, షోకాజ్ నోటీసులు, లైసెన్సుల రద్దు పెరిగింది. ఈ తీవ్రతను గుర్తించినందునే రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు రైతులను అప్రమత్తం చేస్తూనే మరోవైపు దుకాణాలపై తనిఖీలు చేస్తున్నది.

