కలం, క్రైమ్ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) బీజేపీ అధికార ప్రతినిధి చికోటి ప్రవీణ్ శుక్రవారం సిట్ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ సిట్ కార్యాలయంలో చికోటి ప్రవీణ్‌ను (Chikoti Praveen) అధికారులు సుమారు గంటన్నరపాటు విచారించి స్టేట్మెంట్ రికార్డు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి చికోటి ప్రవీణ్ ఫోన్ ట్యాపింగ్‌లో ఉన్నట్లు సిట్ గుర్తించింది.
ఇందులో భాగంగానే విచారణకు హాజరుకావాలని చికోటి ప్రవీణ్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీచేశారు. మరోవైపు చికోటి ప్రవీణ్ గతంలోనే డీజీపీకి ఫిర్యాదు చేశారు. అప్పటి టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధకిషన్ రావు తన ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా ఆయనకు నోటీసులు జారీచేయడంతో సిట్ విచారణకు హాజరయ్యారు.
2 వేలకుపైగా ఫోన్లు ట్యాపింగ్ చేశారు
విచారణ ముగిసిన అనంతరం చికోటి ప్రవీణ్ (Chikoti Praveen) మీడియాతో మాట్లాడారు. తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందంటూ గతంలోనే తాను ఫిర్యాదు చేశానని గుర్తుచేశారు. 2 వేలకు పైగా ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేశారని, ఈ వ్యవహారంలో టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధకిషన్‌రావు కీలక పాత్ర పోషించారని ఆరోపించారు. ఇది ముమ్మాటికి కేసీఆర్, కేటీఆర్ చేయించిన ట్యాపింగే అని ఆరోపించారు.
రాధాకిషన్‌రావు కూడబెట్టిన అక్రమ ఆస్తులపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలకు లేఖ రాస్తానని తెలిపారు. నిందితులకు నార్కో అనాలిసిస్ పరీక్ష నిర్వహిస్తే అసలు నిజాలు బయటకు వస్తాయని అన్నారు.
Read Also: తండ్రి కల కోసం రూ.30 కోట్ల ఆస్పత్రి.. ప్రవీణ్ లక్ష్యం 2028
Follow Us On : WhatsApp

