బీజేపీకి షాక్.. నేషనల్ చీఫ్ ఇలాకాలో పీకే పాగా

కలం, వెబ్ డెస్క్: బీహార్ ఉప ఎన్నికలో పొలిటికల్ స్ట్రాటజిస్ట్, జన్‌ సూరజ్ పార్టీ (జేఎస్‌పీ) ఫౌండర్ ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) సంచలన విజయం సాధించారు. బీజేపీకి కంచుకోట అయిన బాంకీపుర్ నియోజకవర్గ బైపోల్‌లో అనూహ్య విజయం సాధించి అధికార పార్టీని దెబ్బ కొట్టారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్‌‌పై 19,324 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ప్రశాంత్‌ కిశోర్‌‌కు 64,151 ఓట్లు, నీరజ్ కుమార్‌‌కు 44,827 ఓట్లు రాగా.. రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అభ్యర్థి రేఖా కుమారి 14,273 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. మిగతా పార్టీల అభ్యర్థులెవరూ కనీసం వెయ్యి ఓట్లు కూడా సాధించలేకపోయారు. కాగా, బీహార్‌‌లోని బాంకీపుర్, గుజరాత్‌లోని మంజల్‌పూర్, మధ్యప్రదేశ్‌లోని దతియా అసెంబ్లీ నియోజకవర్గాల్లో జులై 30న ఉప ఎన్నికలు నిర్వహించగా ఫలితాలను ఎలక్షన్ కమిషన్ సోమవారం విడుదల చేసింది.

కూలిన బీజేపీ కంచుకోట

బాంకీపుర్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీకి కంచుకోట. ఇక్కడ దశాబ్దాలుగా ఆ పార్టీదే హవా. 2008 డీలిమిటేషన్ టైమ్‌లో బాంకీపుర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఏర్పడింది. అప్పటి నుంచి బీజేపీనే గెలుస్తూ వస్తున్నది. ప్రస్తుత బీజేపీ నేషనల్ చీఫ్ నితిన్ నబీన్‌ ఇక్కడి నుంచి వరుసగా నాలుగుసార్లు విజయం సాధించారు. ఆయన 2010, 2015, 2020, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత బీజేపీ చీఫ్‌గా నియమితులు కావడం, రాజ్యసభకు కూడా నామినేట్ కావడంతో ఎమ్మెల్యే పదవికి నబీన్ రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక వచ్చింది.

జేఎస్‌పీకి తొలి విజయం

ఎన్నికల్లో జేఎస్‌పీకి ఇదే తొలి విజయం. ఆ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ పోటీ చేయకపోయినప్పటికీ, తన పార్టీ తరఫున 238 (మొత్తం 243 సీట్లు) మంది అభ్యర్థులను బరిలోకి దించారు. కానీ ఒక్కరు కూడా గెలవలేకపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల నాటి ఘోర పరాజయంతో బాంకీపుర్‌ ఉప ఎన్నికలో పీకేనే నేరుగా బరిలోకి దిగారు. బీజేపీ అభ్యర్థిని మట్టికరిపించి, పార్టీకి తొలి విజయం అందించారు.

బీజేపీ అభ్యర్థి నీరజ్‌ కుమార్‌కు పీకే స్థాయిలో ప్రజాదరణ లేకపోవడం, ఎప్పటి నుంచో బీజేపీ కంచుకోటగా ఉన్న బాంకీపుర్‌‌లో ఓటర్లు మార్పు కోరుకోవడం.. ప్రశాంత్ కిశోర్‌‌ గెలుపుకు కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇటు అధికార బీజేపీ, అటు ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీ ఓటు బ్యాంకులో చీలిక రావడం.. అగ్రవర్ణాల్లోని కొన్ని సెక్షన్లు సహా ముస్లిం, యాదవ్ ఓటర్లలోని కొందరు పీకే వైపు మొగ్గు చూపడం ఆయనకు కలిసొచ్చిందనేది విశ్లేషకులు చెబుతున్న మాట. ఎన్నికల వ్యూహకర్త అయిన పీకే ప్రచారంలో తన వ్యూహాలను పక్కాగా అమలు చేశారు. ప్రజలతో మమేకమవ్వడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ప్రచారంలో కులం, మతం వంటి అంశాలను కాకుండా ప్రజాసమస్యలను లేవనెత్తారు.

మంజల్‌పూర్‌ బీజేపీదే

గుజరాత్‌లోని మంజల్‌పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాన్ని బీజేపీ తిరిగి దక్కించుకున్నది. ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సతీశ్‌ పటేల్‌ విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి బికాభాయ్‌ రబారీపై 30,630 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. సతీశ్ పటేల్‌కు 55,481 ఓట్లు రాగా, రబారీకి 24,851 ఓట్లు వచ్చాయి. నోటాకు 2,247 ఓట్లు పడ్డాయి. కాగా, బీజేపీ ఎమ్మెల్యే యోగేశ్‌ పటేల్‌ ఆకస్మిక మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు.

దతియా కాంగ్రెస్ కైవసం

మధ్యప్రదేశ్‌లోని దతియా అసెంబ్లీ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ తిరిగి కైవసం చేసుకున్నది. ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఘన్‌శ్యామ్ సింగ్ 6,016 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి అశుతోశ్ తివారీపై విజయం సాధించారు. ఘన్‌శ్యామ్ సింగ్‌కు 66,757 ఓట్లు, అశుతోశ్ తివారీకి 60,741 ఓట్లు రాగా.. ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) అభ్యర్థి దామోదర్ యాదవ్ మండల్‌కు 22,527 ఓట్లు వచ్చాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో దతియా సెగ్మెంట్ నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర కుమార్ భారతి ఫ్రాడ్ కేసులో దోషిగా తేలడంతో ఆయన అనర్హత వేటు పడింది. దీంతో ఉప ఎన్నిక వచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>