కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం నగరంలో నేరాల నియంత్రణ, భద్రతా చర్యల్లో భాగంగా ఖమ్మం అర్బన్ పోలీసులు (Khammam Police) ముమ్మర తనిఖీలు చేపట్టారు. గురువారం ఖానాపురం హవెలి ఇన్స్పెక్టర్ భానుప్రకాష్ ఆధ్వర్యంలో పోలీసులు పలు లాడ్జీలు, హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హోటళ్లలోని కస్టమర్ల రిజిస్టర్ ఎంట్రీలు, గుర్తింపు పత్రాలు, సీసీటీవీ కెమెరాల పనితీరుతో పాటు చెక్-ఇన్, చెక్-అవుట్ సమయాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ తనిఖీల సందర్భంగా ఇన్స్పెక్టర్ భానుప్రకాష్ లాడ్జీల యాజమాన్యాలకు పలు కీలక సూచనలు చేశారు. గదులు అద్దెకు తీసుకునే ప్రతి గెస్ట్ నుండి ఒరిజినల్ గుర్తింపు కార్డులను నిశితంగా పరిశీలించి, వాటి జిరాక్స్ ప్రతులను తప్పనిసరిగా భద్రపరచాలని ఆదేశించారు. సరైన గుర్తింపు పత్రాలు లేని ఎవరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ గదులను కేటాయించకూడదని స్పష్టం చేశారు. అలాగే హోటల్ ప్రవేశ ద్వారాలు, ఎగ్జిట్ గేట్లు, రిసెప్షన్ ప్రాంతాలలో హైడెఫినిషన్ సీసీటీవీ కెమెరాలు 24 గంటలూ నిరంతరాయంగా పనిచేసేలా చూడటం యాజమాన్యం కనీస బాధ్యతని గుర్తుచేశారు.
లాడ్జీల పరిసరాల్లో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు గమనించినా, అసాధారణ కార్యకలాపాలు జరుగుతున్నట్లు అనుమానం వచ్చినా, యాజమాన్యం ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సరైన రికార్డులు నిర్వహించని, భద్రతా ప్రమాణాలను పాటించని లాడ్జీల యాజమాన్యాలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇదిలా ఉండగా, నగరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు బల్లెపల్లి గణేష్ టౌన్ షిప్ వద్ద పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. ఆ మార్గంలో వెళ్లే వాహనాలను ఆపి, పత్రాలను నిశితంగా పరిశీలించారు.

