కలం, వెబ్ డెస్క్ : స్పానిష్ ఫుట్‌బాల్ దిగ్గజం రియల్ మాడ్రిడ్ (Real Madrid) కొత్త సీజన్‌కు ముందు తన జట్టును మరింత బలోపేతం చేసుకుంది. ఫ్రాన్స్ స్టార్ డిఫెండర్ ఇబ్రహిమా కొనాటేతో (Ibrahima Konate) నాలుగేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు క్లబ్ అధికారికంగా ప్రకటించింది. 27 ఏళ్ల కొనాటే జూన్ చివరిలో లివర్‌పూల్‌ను వీడి రియల్ మాడ్రిడ్‌లో చేరనున్నాడు. ఆన్‌ఫీల్డ్‌లో అతని ఒప్పందం ముగియడంతో ఫ్రీ ఏజెంట్‌గా స్పానిష్ క్లబ్‌లోకి మారుతున్నాడు. ఈ ఒప్పందం 2030 జూన్ 30 వరకు అమలులో ఉంటుంది. ఈ వేసవి ట్రాన్స్‌ఫర్ విండోలో రియల్ మాడ్రిడ్ చేసిన మూడో కీలక సంతకం ఇదే. ఇప్పటికే మార్క్ కుకురెల్లా, బెర్నార్డో సిల్వాలను జట్టులోకి తీసుకున్న క్లబ్, ఇప్పుడు కొనాటేను కూడా చేర్చుకుంది. కొత్త కోచ్ జోస్ మౌరిన్యో ప్రణాళికలలో ఈ ముగ్గురు కీలక పాత్ర పోషించనున్నారు.
2021లో ఆర్బీ లైప్‌జిగ్ నుంచి లివర్‌పూల్‌కు వచ్చిన కొనాటే, గత ఐదేళ్లలో జట్టుకు నమ్మకమైన డిఫెండర్‌గా గుర్తింపు పొందాడు. లివర్‌పూల్ తరఫున అన్ని టోర్నీలలో కలిపి 183 మ్యాచ్‌లు ఆడి తన ప్రతిభను చాటాడు. 2024-25 సీజన్‌లో ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలిచిన జట్టులో సభ్యుడిగా నిలిచిన కొనాటే, రెండు లీగ్ కప్‌లు, ఒక ఎఫ్‌ఏ కప్‌ను కూడా సాధించాడు. ప్రస్తుతం ఫిఫా ప్రపంచకప్ 2026లో ఫ్రాన్స్ జట్టుతో ఉన్న అతను, అంతర్జాతీయ బాధ్యతలు పూర్తయ్యాక రియల్ మాడ్రిడ్ జట్టుతో చేరనున్నాడు. కొత్త సీజన్‌లో కొనాటే రాకతో రియల్ మాడ్రిడ్ డిఫెన్స్ మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

