కలం, ఎంజీయూ: మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ) బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం, తెలంగాణ స్కిల్ అండ్ అకాడమిక్ ట్రైనింగ్-టీసాట్ (MGU-TSAT) సంయుక్త ఆధ్వర్యంలో విద్యా విస్తరణకు సరికొత్త అడుగు పడింది. విశ్వవిద్యాలయంలో మరిన్ని ఆన్‌లైన్ తరగతులతోపాటు, కొత్తగా సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించేందుకు ఇరు సంస్థల మధ్య (MGU-TSAT) గురువారం అవగాహన ఒప్పందం కుదిరింది. ఎంజీయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్, టీ- సాట్ సీఈఓ బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి సమక్షంలో ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు. ఈ సందర్భంగా ఎంజీయు వైస్ ఛాన్సలర్ ప్రొ. ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఈ భాగస్వామ్యం ద్వారా విశ్వవిద్యాలయం అందిస్తున్న విద్యా అవకాశాలు మరింత విస్తృతం కానున్నాయని తెలిపారు.
ముఖ్యంగా గ్రామీణ, పరిమిత వనరులు ఉన్న ప్రాంతాల యువతకు, వృత్తిపరంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలనుకునే వారికి ఈ ఆన్‌లైన్ కోర్సులు కీలకంగా మారుతాయన్నారు. టీ-సాట్ సీఈఓ బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్థిక పరిమితుల వల్ల ఉన్నత విద్యకు దూరమైన వర్గాలకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందుబాటులోకి తేవడమే టీ-సాట్ ప్రధాన లక్ష్యమన్నారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక సర్టిఫికెట్ ప్రోగ్రాములు రూపొందించి, విద్యార్థుల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి విశ్వవిద్యాలయాల అనుసంధానం ఎంతగానో తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో మేనేజ్‌మెంట్ విభాగం విజయవంతంగా నిర్వహించిన టూరిజం డిజిటల్ తరగతుల అనుభవంతో, త్వరలోనే టూరిజం మేనేజ్‌మెంట్, లాజిస్టిక్ మేనేజ్‌మెంట్ వంటి ప్రత్యేక సర్టిఫికెట్ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. రాబోయే రోజుల్లో ఈ ఆన్‌లైన్, సర్టిఫికెట్ కోర్సుల పరిధిని వర్సిటీలోని ఇతర విభాగాలకు కూడా విస్తరించనున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీ సాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాధిక్, జనరల్ మేనేజర్ లింగారెడ్డి, మహాత్మగాంధీ యూనివర్సిటీ మేనేజ్మెంట్ డీన్ ఆచార్య అలవాల రవి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఆచార్య ఆకుల రవి, అధ్యాపకులు డా. సభినా హరాల్డ్, డా. మిరియాల రమేశ్, డా. వెంకట రమణారెడ్డి, డా. లక్ష్మీప్రభ, ఆచార్య శ్రీ లక్ష్మి, డా. శ్వేత, డా. అనురాధ, డా. జక్క సురేశ్ రెడ్డి, డా. కట్ట కిరణ్ మై, డా. జ్యోతి, రమేశ్ నాయక్ పాల్గొన్నారు.

