కలం, వెబ్ డెస్క్ :సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో కీలకమైన రంగం (Mahankali Rangam) కార్యక్రమం సోమవారం ఉదయం భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా జరిగింది. ఈ వేడుకలో మాతంగి స్వర్ణలత పచ్చి కుండపై నిలబడి భవిష్యవాణిని వినిపించారు. ఈ అపురూప ఘట్టాన్ని కళ్లారా తిలకించేందుకు భక్తులు ఆలయ పరిసరాలకు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత భక్తులను, ప్రజలను ఉద్దేశించి పలు హెచ్చరికలు చేశారు. దేశంలో ఎలాంటి ప్రమాదాలు వచ్చినా తానే స్వయంగా ప్రజలను కాపాడుతున్నానని, అయినప్పటికీ ప్రజలు తన మాటలను ఆచరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయని, ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కేవలం భారీ వర్షాలే కాకుండా, తీవ్రమైన అగ్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయని హెచ్చరించారు. వరదల తాకిడికి ప్రజలు కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉందని చెప్పారు. సమాజంలో మనుషులు వావివరుసలు లేకుండా ఘోరాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారిని తాను ఎంతమాత్రం వదిలిపెట్టనని స్పష్టం చేశారు. మనుషుల ప్రవర్తన వల్ల తనకు కనీస సంతోషం లేకుండా చేస్తున్నారని భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత పేర్కొన్నారు.

